భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై ఆందోళనలతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈ కారణంగా అసోం, త్రిపుర సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఫలితంగా గువాహటి, అగర్తలాలో జరుగుతున్న రంజీ మ్యాచ్లను రద్దు చేసింది బీసీసీఐ.
"రంజీ మ్యాచ్లను నిలిపివేయాలని రాష్ట సంఘాలకు ఇప్పటికే సూచించాం. క్రికెటర్ల భద్రతే ముఖ్యం.. అందుకే వారిని హోటళ్లలోనే ఉండాలని కోరాం. మ్యాచ్లను మళ్లీ ఆడించాలా లేదా పాయింట్లను సమానంగా పంచడమా? అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటాం"
-సబా కరీం, బీసీసీఐ జీఎం
ప్రస్తుతం గువాహటిలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు(ఎస్ఎస్సీబీ).. అసోంకు మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. అగర్తలా వేదికగా త్రిపుర, ఝార్ఖండ్ తలపడుతున్నాయి. నిరసనల కారణంగా.. ఈ రెండింటినీ నిలిపివేశారు.