తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నెట్​బౌలర్​ నుంచి పేసర్​ స్థాయికి నటరాజన్​' - నటరాజన్​పై వార్నర్​ ప్రశంసలు

భారత ఫాస్ట్​ బౌలర్​ నటరాజన్​పై డేవిడ్​ వార్నర్​ ప్రశంసలు కురిపించాడు. తన ప్రతిభతో నెట్​బౌలర్​ నుంచి టీమ్​ఇండియాలో పేసర్​ స్థాయికి ఎదిగాడని కితాబిచ్చాడు. నటరాజన్​ ప్రదర్శన పట్ల సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​గా తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.

David Warner praises Natarajan from net bowler to India debut
'నెట్​బౌలర్​ నుంచి పేసర్​ స్థాయికి నటరాజన్​'

By

Published : Dec 10, 2020, 10:07 PM IST

టీమ్​ఇండియా ఫాస్ట్​ బౌలర్​ నటరాజన్​పై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్​ ప్రశంసలు కురిపించాడు. నెట్​బౌలర్​ నుంచి జట్టులో పేసర్​గా ఎదిగాడని వార్నర్​ వెల్లడించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో నటరాజన్‌ ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ పేసర్‌ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. మూడో టీ20 అనంతరం వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నటరాజన్‌ను పొగుడుతూ ఓ పోస్టు చేశాడు. ఐపీఎల్లో తన సహచర ఆటగాడైన నటరాజన్‌.. భారత్‌-ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొట్టాడని, నెట్‌ బౌలర్‌గా ఈ పర్యటనకు ఎంపికై తర్వాత భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మెచ్చుకున్నాడు.

క్రికెట్‌లో గెలుపోటములు పక్కనపెడితే టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకొంటారని వార్నర్‌ పేర్కొన్నాడు. తాము టీ20 సిరీస్‌ కోల్పోయినా నటరాజన్‌ ప్రదర్శన పట్ల ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. నటరాజన్‌ మంచి ఆటగాడని, ఈ సిరీస్‌ను ఆస్వాదించానని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ వివరించాడు. ఇదిలా ఉండగా.. నటరాజన్‌ తొలుత ఈ ఆస్ట్రేలియా పర్యటనకు నిజంగానే నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే, టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేల్లో అనూహ్యంగా ఓటమి పాలవ్వడం వల్ల మూడో వన్డేలో నటరాజన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. అప్పుడతడు ఫర్వాలేదనిపించడం వల్ల తర్వాత టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు, రెండో మ్యాచ్‌లో రెండు, మూడో మ్యాచ్‌లో ఒక వికెట్‌ పడగొట్టాడు. మరోవైపు యూఏఈలో గతనెల పూర్తి అయిన 13వ సీజన్‌లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details