ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేటప్పుడు వర్ణవివక్ష ఎదుర్కొన్నానని ఇటీవల ఆరోపణలు చేసిన వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామి తాజాగా ఆ వివాదంపై స్పష్టతనిచ్చాడు. తనని అలా ప్రత్యేక పదంతో పిలిచిన వారిలో ఒకరితో మాట్లాడానని చెప్పాడు. అప్పుడు వాళ్లు ప్రేమ పూర్వకంగానే అలా పిలిచారని తనతో చెప్పినట్లు వివరించాడు.
సామి.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేస్తూ తనతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరెరాను సన్‌రైజర్స్ ఆటగాళ్లు వర్ణవివక్ష పదజాలంతో పిలిచారని తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ట్విట్టర్లో మరో పోస్టు చేసి దానిపై స్పందించాడు.
"నన్ను అలా పిలిచినవారిలో ఒకరితో మాట్లాడాను. ఈ విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే, వర్ణవివక్షపై దుష్ప్రచారాలు మానేసి, అందరికీ అవగాహన కల్పించాలని అనుకున్నాం. నా సోదరుడు అప్పుడు ప్రేమ పూర్వకంగా అలా పిలిచాడని పూర్తి భరోసా ఇచ్చాడు. అతడిని నమ్ముతున్నా".