వచ్చే నెలలో భారత్‌లో పర్యటించే టీ20, టెస్టు జట్టును మంగళవారం ప్రకటించారు దక్షిణాఫ్రికా సెలక్టర్లు. ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగేందుకు సిద్ధమైన పేసర్ డేల్ స్టెయిన్ పేరు అందులో లేకపోవడం అతడితో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై స్పందించిన స్టెయిన్... తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు సెలక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. జట్టులో లేకపోవడం వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సహా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.
గాయం కారణంగా ప్రపంచకప్ ఆరంభంలోనే నిష్క్రమించిన స్టెయిన్.. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నా తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే టీమిండియాతో టీ20 సిరీస్ తప్పక ఆడతానని ప్రకటించాడు స్టెయిన్. కానీ అతడికి ఆ అవకాశం దక్కలేదు.