తెలంగాణ

telangana

ETV Bharat / sports

మంచే సమస్య.. లేదంటే గులాబీదే విజయం

భారత్-బంగ్లాదేశ్ మధ్య డే/నైట్ టెస్టు నవంబర్ 22న ప్రారంభంకానుంది. గులాబి బంతితో మ్యాచ్​ జరగనుండగా దీనిపై మాజీలు, క్రికెట్ పండితులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ ఆటగాడు సచిన్ తన మనసులోని మాటలు పంచుకున్నాడు.

సచిన్

By

Published : Oct 31, 2019, 5:46 PM IST

టీమిండియా ఎట్టకేలకు గులాబి బంతితో డే/నైట్ టెస్టు ఆడటానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్​తో ఈ మ్యాచ్​ జరగనుంది. ఇలా గులాబి బంతిలో ఆడటం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్. మంచును సరిగా అంచనా వేస్తే మ్యాచ్​కు ఎలాంటి సమస్య ఉండదని తెలిపాడు. లేదంటే తడిచిన బంతితో పేసర్లు, స్పిన్నర్లకు సవాళ్లు తప్పవన్నాడు.

మంచు ప్రధాన సమస్య

మంచు సమస్యగా మారనంత వరకు డే/నైట్‌ టెస్టు మంచి ముందడుగే. కానీ, మంచు ప్రభావం చూపిస్తే పేసర్లు, స్పిన్నర్లకు సవాల్‌గా ఉంటుంది. బంతి తడిస్తే బౌలర్లు ఏం చేయలేరు. అదే మంచు లేకుంటే ఈ మ్యాచ్‌ అదనపు ఆకర్షణ అవుతుంది. ఈడెన్‌లో మంచుదే కీలక పాత్ర. మ్యాచ్‌కు ముందు అక్కడ ఎంత మంచు కురుస్తుందో చూడాలి.

రెండు కోణాలు

డే/నైట్‌ టెస్టును రెండు కోణాల్లో చూడాలి. ఒకటి ప్రజల కోణం. పగలంతా పనిచేసిన తర్వాత సాయంత్రం సరదాగా మ్యాచ్ చూడటాన్ని వారు గొప్పగా ఆస్వాదిస్తారు. రెండోది ఆటగాళ్ల దృష్టికోణం. గులాబి బంతితో ఆడటం అనుకున్నంత చెడ్డదేమీ కాదు. సంప్రదాయ ఎరుపు బంతితో పోలిస్తే ఈ బంతి ఎలా ప్రవర్తిస్తుందో పరీక్షించడం ఆటగాళ్లకు మంచిదే. ఇక్కడ బంతి రంగు మారుతుందంతే.

పింక్ బాల్ టెస్టు

వేర్వేరు బంతులతో సాధన

నెట్స్‌లో ఆటగాళ్లు వేర్వేరు బంతులతో సాధన చేయాలి. కొత్త గులాబి బంతి, 20 ఓవర్లు, 50 ఓవర్లు, 80 ఓవర్లు పాతబడ్డ బంతులు వాడాలి. కొత్త, కాస్త పాత, పూర్తిగా పాతదైన గులాబి బంతులు ఎలా ప్రవర్తిస్తున్నాయో పరిశీలించాలి. దానికి అనుగుణంగా వ్యూహరచన చేయాలి. దులీప్‌ ట్రోఫీలో గులాబి బంతితో ఆడిన ఆటగాళ్ల అనుభవాన్ని టీమిండియా క్రికెటర్లు తెలుసుకోవాలి. ఇది జట్టుకు మేలు చేస్తుంది. 1991-92లో భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ముక్కోణపు సిరీస్‌లో నేనిలాగే వేర్వేరు బంతులతో సాధన చేశాను.

స్పిన్నర్లకూ ఓకే

గులాబి బంతి టెస్టులో మరో అంశం ఏంటంటే పిచ్‌పై పచ్చికను 8 మిల్లీమీటర్ల వరకు పెంచుతారు. నిజమే, సీమర్లకు ఇది సహాయకారే. కానీ, నాణ్యమైన స్పిన్నర్‌ లయ దొరకబుచ్చుకుని ప్రభావం చూపించగలడు. పిచ్‌ ఉపరితలంపై బౌన్స్‌ ఎంతుంది, బంతి ఎలా జారుతుందో తెలుసుకోవడం కీలకం. పచ్చిక ఎక్కువగా ఉంటే బంతి పట్టు చిక్కుతుందో లేదో చూడాలి.

కీపర్‌ కీలకం

టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గులాబి టెస్టులో అత్యంత కీలక పాత్ర పోషించగలడు. పరిస్థితిని అతడు పరిశీలించగలడు. బంతి జారుతుందా, బ్యాటుపైకి సులభంగా వస్తుందా లేదా చెప్పగలడు. అతడికీ బౌలర్లకు మధ్య సమన్వయం ఎంతో అవసరం.

బంతులు తయారుచేసే ఎస్‌జీ కంపెనీ పేరున్న సంస్థ. గులాబి బంతిని రూపొందించే ముందే వారు పరిశోధనలెన్నో చేసుంటారు. నాణ్యమైన గులాబి బంతులు రూపొందిస్తారని నమ్మకముంది.

ఇవీ చూడండి.. టీమిండియాను ఓడించడానికి బంగ్లాకు ఇదే మంచి తరుణం

ABOUT THE AUTHOR

...view details