ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టు నుంచి మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఫిబ్రవరి 13న (శనివారం) ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. టికెట్ల కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానం వద్ద క్రికెట్ అభిమానులు గురువారం పెద్దఎత్తున బారులు తీరారు. కరోనా ఆంక్షలను లెక్కచేయకుండా గుమిగూడటం వల్ల చెపాక్ వద్ద చాలా సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
'పొరబడ్డారు.. శనివారమూ ఇస్తాం'
రెండో టెస్టుకు 50శాతం వీక్షకులను అనుమతించింది తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్‌సీఏ). టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించినా.. భౌతికరూపంలో వాటిని స్టేడియం వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. అభిమానులు ఒక్కసారిగా కిక్కిరిసిపోవడానికి గల కారణం అపార్థం చేసుకోవడమేనని టీఎన్‌సీఏ చెప్పింది. తాము 11వ తేదీ నుంచి టికెట్లు ఇస్తాం అని చెబితే ఆ ఒక్క రోజు మాత్రమే ఇస్తారని వారు పొరబడినట్లు తెలిపింది. అయితే పోలీసులు, సిబ్బంది సహకారంతో పరిస్థితిని అదుపు చేసినట్లు వివరించింది. శుక్రవారం ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పిన టీఎన్‌సీఏ.. శనివారం కూడా టికెట్లు తీసుకొవచ్చని స్పష్టం చేసింది.