టెస్టు క్రికెట్‌కు జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. ఓ ఆటగాడి అసలు సిసలు ప్రతిభ ఈ ఫార్మాట్ ద్వారానే బయట పడుతుంది. టాపార్డర్ విఫలమైన సమయంలో మిడిలార్డర్ జట్టును ఆదుకునే బాధ్యత తీసుకుంటుంది. కొన్నిసార్లు టెయిలెండర్లూ పట్టుదలగా ఆడి మ్యాచ్‌ను మలుపుతిప్పిన సందర్భాలున్నాయి. అయితే కొందరు టెయిలెండర్లు మాత్రం టెస్టుల్లో ఎక్కువసార్లు డకౌట్ అయి ఓ చెత్త రికార్డునూ మూటగట్టుకున్నారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.
కోర్ట్నీ వాల్ష్ - వెస్టిండీస్ (43 డక్స్)
కోర్ట్నీ వాల్ష్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ పేసర్లలో ఒకరు. వాల్ష్ చేతిలో బంతి ఉందంటే బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకుపుట్టడం సహజమే. అలాంటి బౌలర్ బ్యాట్ పడితే మాత్రం తడబడతాడు. 132 టెస్టు మ్యాచ్‌లాడిన వాల్ష్ ఏకంగా 43 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్నిసార్లు డకౌట్ అవడం టెస్టు క్రికెట్లో ఓ రికార్డు. ఇందులో నాలుగు సార్లు ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగులకే పెవిలియడం చేరడం గమనార్హం. 1984-2001 వరకు మొత్తం 17 ఏళ్ల టెస్టు కెరీర్లో 936 పరుగులు మాత్రమే సాధించాడితడు. ఇందులో 61 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.
క్రిస్ మార్టిన్ - న్యూజిలాండ్ (36 డక్స్)
న్యూజిలాండ్ పేసర్ క్రిస్ మార్టిన్ మొత్తం 13 ఏళ్లు టెస్టు జెర్సీ ధరించాడు. కివీస్ బౌలింగ్ యూనిట్‌కు దన్నుగా నిలబడ్డాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లతో సత్తాచాటాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం కాస్త తడబడ్డాడు. తన టెస్టు కెరీర్లో 36 సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఇందులో 7 సార్లు ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతడి టెస్టు కెరీర్లో మొత్తం 615 బంతులు ఎదుర్కొని123 పరుగులు మాత్రమే సాధించాడు.