తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి బంతికి సిక్స్​తో సెంచరీ చేసిన క్రికెటర్లు

క్రికెట్​లో శతకాలు చేయడమనేది గొప్పగా భావిస్తారు ఆటగాళ్లు. అదే ఉత్కంఠ రీతిలో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరు. అలాంటిది ఇన్నింగ్స్​ చివరి బంతికి సిక్సు బాది మూడంకెల స్కోర్ పూర్తి చేస్తే ఆ మజా అంతా ఇంతా కాదు. అలాగ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సుతో సెంచరీలు పూర్తి చేసుకున్న క్రికెటర్లెవరో చూద్దాం.

Players who completed centuries with six on last ball of the innings
క్రికెట్

By

Published : Jun 8, 2020, 11:25 AM IST

ఏ క్రికెటర్​కైనా సెంచరీ అనేది ఓ గొప్ప అనుభూతి. అయితే టాప్​ త్రీ బ్యాట్స్​మెన్​తో పోల్చుకుంటే మిడిలార్డర్ బ్యాట్స్​మెన్ శతకాలు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కొందరు ఓవర్లు సరిపోక 90 పరుగుల వద్దే మిగిలిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మరికొందరు అదృష్టవశాత్తు తొందరగా మూడెంకల స్కోరును చేరుకుంటారు. అలా కాకుండా ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సు బాది సెంచరీ సాధించిన బ్యాట్స్​మెన్​పై ఓ లుక్కేద్దాం.

ఏబీ డివిలియర్స్​-ఇండియాపై (2015)

2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా 5 మ్యాచ్​ల వన్డే సిరీస్ ఆడింది. ఇందులో మొదటి మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్​లో సఫారీ సేన 23.2 రెండు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అప్పుడు నాలుగో వికెట్​గా క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ 54 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఏబీ 60 పరుగుల వద్ద ఉన్నాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో సఫారీ జట్టు 65 పరుగులు రాబట్టగా.. అందులో డివిలియర్స్​ ఒక్కడే 13 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. చివరి ఓవర్​కు వచ్చేసరికి డివిలియర్స్​ 98 పరుగుల వద్ద నిలిచాడు. ఈ ఓవర్​లో బెహర్డీన్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్​లో వరుస బంతుల్లో 4,4,6 బాదాడు. చివరికి క్రీజులోకి వచ్చిన ఏబీ చివరి బంతికి సిక్సు బాది సెంచరీ ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్​లో ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు సాధించింది సఫారీ జట్టు. రోహిత్​ శర్మ 133 బంతుల్లో 150 పరుగులతో మెరిసినా.. దక్షిణాఫ్రికా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

డివిలియర్స్

మహ్మద్ యూసఫ్-జింబాబ్వేపై (2002)

2002 ఏడాది చివర్లో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ రెండు టెస్టుల అనంతరం ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్​లో మహ్మద్ యూసఫ్ అద్భుత ఫామ్​లో ఉన్నాడు. రెండో టెస్టులో 159 పరుగులతో సత్తాచాటిన మహ్మద్.. తొలి వన్డేలోనూ సెంచరీ (141) సాధించాడు. రెండో వన్డేలోనూ 34 బంతుల్లో 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వన్డేలో 30వ ఓవర్​లో బ్యాటింగ్​కు వచ్చిన యూసఫ్​ 44వ ఓవర్​ పూర్తయ్యే సరికి 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత స్ట్రయిక్​ రొటేట్ చేస్తూ పరుగులు సాధించిన ఈ పాక్ బ్యాట్స్​మన్ 49 ఓవర్​ పూర్తయ్యాక 87 పరుగుల వద్ద నిలిచాడు. అయితే చివరి బంతికి 94 పరుగుల వద్ద ఉన్న మహ్మద్.. సిక్స్​తో 68 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు.

మహ్మద్ యూసఫ్

క్రేగ్ మెక్​మిలన్-పాకిస్థాన్​పై (2001)

పాకిస్థాన్​తో జరిగిన ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా 2-1 తేడాతో వెనకబడిన న్యూజిలాండ్​ నాలుగో వన్డేలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. 30 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులతో బలమైన స్థితిలో నిలిచింది కివీస్. కానీ నాథన్ ఆస్లే (71) ఔటయ్యాక రన్​రేట్ కాస్త మందగించింది. అప్పటికే క్రేగ్ మెక్​మిలన్​ 32 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 31 నుంచి 43 ఓవర్ల మధ్య కేవలం 19 బంతులే ఎదుర్కొన్న క్రేగ్​ 50 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చిన మెక్​మిలన్ 49 ఓవర్లు పూర్తయ్యే సరికి 70 బంతుల్లో 85 పరుగులకు చేరుకున్నాడు. చివరి బంతికి 97 పరుగుల వద్ద నిలిచిన క్రేగ్..​ సిక్స్​తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కివీస్ 5 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 138 పరగుల తేడాతో విజయం సాధించింది.

కెవిన్ పీటర్సన్-దక్షిణాఫ్రికా (2005)

కెరీర్ ప్రారంభంలో దూకుడైన ఆటతీరుతో మెప్పించాడు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్. మొదటి ఏడు ఇన్నింగ్స్​ల్లో 114 సగటుతో 342 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఏడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో 108 పరుగులతో సత్తాచాటాడు. ఈ మ్యాచ్​ టైగా ముగిసింది. తర్వాత రెండు మ్యాచ్​లను కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. సిరీస్​లో 2-1 తేడాతో వెనకబడింది. ఈస్ట్​లండన్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో సఫారీ సేన 311 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ 27 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులతో ఉన్న దశలో పీటర్సన్​ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి ఇంకా 195 పరుగులు చేయాల్సి ఉంది.

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పీటర్సన్​ 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40వ ఓవర్​ పూర్తయ్యే సరికి 44 బంతుల్లో 63 పరుగులతో నిలిచాడు. అప్పటికీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఇంకా 98 పరుగులు వెనకబడి ఉంది. తర్వాత ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. అయితే పీటర్సన్ మాత్రం 9 బంతుల్నే ఎదుర్కొన్నాడు. చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉంది. కెవిన్​ 58 బంతుల్లో 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తర్వాత రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడీ ఆటగాడు. ఫలితంగా గెలుపునకు చివరి ఓవర్లో 23 పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి 14 పరుగులు చేయాల్సి ఉండగా పీటర్సన్​ 94 పరుగుల వద్ద ఉన్నాడు. ఆండ్రూ నీల్ వేసిన ఫుల్​టాస్​ను సిక్సర్​గా మలిచిన ఈ ఆటగాడు సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మహ్మద్ యూసఫ్-ఇండియాపై (2000)

2000 ఏడాది బంగ్లాదేశ్​లో జరిగిన ఆసియా కప్​లో భాగంగా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో పాకిస్థాన్-ఇండియా తలపడ్డాయి. భారత్​పై భారీ విజయంతో అప్పటికే పాయింట్ల పట్టికలో టాప్​లోకి దూసుకెళ్లింది లంక. నెట్ రన్​రేట్​ కాస్త తక్కువగా ఉండటం వల్ల ఫైనల్​కు చేరాలంటే పాక్​పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దాయాది జట్టు 12.2 ఓవర్లలో ఓపెనింగ్​ వికెట్​కు 74 పరుగులు జోడించింది. కానీ తర్వాత ఐదు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

21 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసిన సమయంలో బాధ్యతను మహ్మద్ యూసఫ్ భుజానికెత్తున్నాడు. మూడో వికెట్​గా వచ్చిన యూసఫ్ మొదట నెమ్మదిగా ఆడాడు. 58 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 42వ ఓవర్లో 90 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన యూసఫ్ వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా 49వ ఓవర్​ నాటికి ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది పాక్. యూసఫ్ 93 (111బంతుల్లో) పరుగుల వద్ద ఉన్నాడు. చివరి ఓవర్ ఆఖరు బంతికి సిక్స్ బాది సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా పాక్​ నిర్ణీత 50 ఓవర్లలో 295 పరుగులు చేసింది. తద్వారా క్రికెట్ చరిత్రలో ఆఖరు బంతికి సిక్సు ద్వారా శతకం పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు యూసఫ్.

ABOUT THE AUTHOR

...view details