క్రికెట్లో పేసర్లు బౌన్సర్లతో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందిపెట్టడం మామూలే. కానీ అదే బౌన్సర్ ఓ క్రికెటర్‌ను బలితీసుకుంటే..! అదో విషాదం. ఇలాంటి సంఘటనే 2014లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో చోటుచేసుకుంది. ఓ వర్ధమాన క్రికెటర్ మరణానికి కారణమైంది.
ఏం జరిగింది?
షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా 2014 నవంబర్ 25న సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ తలపడ్డాయి. ప్రత్యర్థి పేసర్ అబాట్ విసిరిన బౌన్సర్.. సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హ్యూస్ తలకు బలంగా తగిలింది. హెల్మెట్ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో బంతి తాకింది. అతడు వెంటనే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో కన్నుమూశాడు. అప్పటికి హ్యూస్ వయసు 25 ఏళ్లు.
ఫిలిప్ హ్యూస్‌కు, క్రికెట్ ఆస్ట్రేలియా నివాళి అర్పించింది. ఐదో వర్ధంతి సందర్భంగా అతడి సేవలను స్మరించుకుంది.
ఆసీస్ తరఫున 25 టెస్టులు, 24 వన్డేలు ఆడిన హ్యూస్.. ఇంగ్లాండ్‌లో చాలాకాలం కౌంటీ క్రికెట్ ఆడాడు. అతడికి జరిగినట్లు మరెవ్వరికీ జరగొద్దన్న ఉద్దేశంతో క్రికెటర్లు నెక్ గార్డులు ధరించాలని ఆస్ట్రేలియా బోర్డు ఆదేశించింది. ఇబ్బందిగా ఉంటుందని చాలామంది వాటిని వినియోగించడం లేదు. ఈ క్రమంలోనే యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న స్టీవ్ స్మిత్ తలకు బలమైన బౌన్సర్ తగిలింది. ఆ తర్వాత నెక్‌గార్డ్ ధరించి 211 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భవిష్యత్తులో గార్డ్ తప్పక ధరిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే నెక్ గార్డుల్ని తప్పనిసరి చేయాలని ఐసీసీ భావిస్తోంది.
ఇవీ చూడండి.. భారత మాజీ క్రికెటర్ గంభీర్‌కు అరుదైన గౌరవం