నాన్న మరణవార్త విన్నాక విలపించానని సిరాజ్ చెప్పాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, టీమ్‌ఇండియా సహచరులు తనను ఓదార్చారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో అనుభవించిన వేదన, సవాళ్లు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని వెల్లడించాడు. నగరానికి వచ్చాక బిర్యానీ ఏం తినలేదని తెలిపాడు. చాన్నాళ్ల తర్వాత ఇంట్లో వండిన ఆహారం తినడంతో ఆనందం కలిగిందన్నాడు.
లబుషేన్ వికెట్ ప్రత్యేకం..
ఆస్ట్రేలియాలో సాధించిన ప్రతి వికెట్‌ను తన తండ్రికి అంకితమిచ్చినట్టు సిరాజ్ తెలిపాడు. తాను తీసిన 13 వికెట్లలో మార్నస్ లబుషేన్ వికెట్ ఎంతో ప్రత్యేకమన్నాడు. ఐదు వికెట్ల ఘనత అందుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఆఖరి టెస్టులో ప్రధాన పేసర్‌గా భావించలేదని జట్టు అవసరాల మేరకు ఆడాలనుకున్నానని వెల్లడించాడు. సవాళ్లంటే తనకిష్టమని, వాటిని ఎదుర్కోవడాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. నిజానికి తనపై కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ బయటకు ప్రదర్శించలేదన్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బంతులు విసిరానని వెల్లడించాడు.
ఇద్దరూ మంచి సారథులే..
‘ప్రస్తుత ప్రదర్శననే మున్ముందు సిరీసుల్లో పునరావృతం చేయాలని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అక్కడ పనికొచ్చింది. లీగులో వార్నర్‌కు ఇన్‌స్వింగర్లు వేసేవాడిని. ఆసీస్‌లోనే అదే ప్రణాళిక అమలు చేశాను. ఈ విజయాన్ని తలకెక్కించుకోకుంటేనే మంచిది. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె ఇద్దరూ మంచి సారథులే. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని, నాకూ అజింక్య ఎన్నో సలహాలు ఇచ్చాడు. మాలో ఆత్మవిశ్వాసం నింపాడు. విజయం దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించాలి. సవాళ్లను అధిగమిస్తే విజయవంతం అవ్వగలం. మున్ముందు సిరీసులను తీవ్రంగా తీసుకుంటాను. విశ్రమించే సమస్యే లేదు’ - సిరాజ్.