మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూలపై రహానెసేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హనుమవిహారి స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
విహారిని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. 'తొందరగా ఔట్ చేయండి' అని అన్నాడు. దీంతో విహారి అభిమానుల వైపు నడుస్తూ.. 'ఔట్ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని బదులిచ్చాడు. ఆసీస్ ఆలౌటైతే, ఆ తర్వాత భారత్ ఛేదనకు దిగి సులువుగా విజయం సాధిస్తుందని, దీంతో మ్యాచ్ తొందరగా ముగుస్తుందనే ఉద్దేశంతో విహారి ఇలా సరదాగా అభిమానితో చెప్పాడు. ఏ ప్రేక్షకుడైనా మ్యాచ్ తొందరగా ముగిసిపోవాలని ఆశించడు కదా! కాగా, కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా ఉన్నంతసేపు దీటుగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.