మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకాబోతోంది. అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కొన్ని జట్లు అనుభవానికి పెద్ద పీట వేస్తే.. మరికొన్ని జట్లు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చాయి. మంచి ప్రదర్శన కనబర్చినా మెగాటోర్నీలో అవకాశం దక్కని ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. 'మిస్సింగ్ ఎలెవన్' అంటూ మరో జట్టును ప్రకటించింది. వారిపై ఓ లుక్కేద్దాం...
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
పాకిస్థాన్ సారథి సర్ఫరాజ్ గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన ఆటగాడు రిజ్వాన్. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా మంచి ప్రదర్శనే కనబర్చాడు. 26 ఏళ్ల ఈ క్రికెటర్ 32 వన్డేల్లో 33.57 సగటుతో 700 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి ఆకట్టుకున్నాడు.
నిరోషాన్ డిక్వెల్లా (శ్రీలంక)
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో పరాజయం పాలైన శ్రీలంకకు ప్రస్తుతం అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చాలా అవసరం. చాలా మంది ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వారిలో నిరోషాన్ డిక్వెల్లా ఉండడం ఆశ్చర్యకరమే. గత ఏడాదిగా ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ 15 ఇన్నింగ్స్‌ల్లో 497 పరుగులు సాధించాడు.
రిషభ్ పంత్ (భారత్)
బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో భారత్ అనుభవానికే ఓటేసింది. పంత్‌కు అవకాశం ఇస్తారని అంతా భావించగా.. తుదిజట్టులో మాత్రం దినేష్ కార్తీక్‌కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావిస్తోంది యాజమాన్యం. కేవలం 5 వన్డేలు ఆడిన ఈ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్... బౌలర్లపై విరుచుపడే సామర్థ్యం ఉన్న ఆటగాడు.
అంబటి రాయుడు (భారత్)
ఏడు నెలల క్రితం వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాయుడుకు మద్దతుగా నిలిచాడు సారథి విరాట్ కోహ్లీ. నాలుగో స్థానానికి రాయుడు సరిగా సరిపోతాడని వ్యాఖ్యానించాడు. కానీ విజయ్ శంకర్ రాకతో ఈ తెలుగు క్రికెటర్‌కు నిరాశే ఎదురైంది. త్రీ డైమెన్షన్ ఉన్న ఆటగాడంటూ శంకర్‌కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. రెండేళ్ల విరామం తర్వాత సెప్టెంబర్ 2018లో పునరాగమనం చేసిన రాయుడు అద్భుతంగా రాణించాడు.
దినేశ్ చండీమల్ (శ్రీలంక)
శ్రీలంక జట్టుకు సారథిగా వ్యవహరించిన చండీమల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడం ఆశ్చర్యకరమే. 2010లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు లంక జట్టులో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకుని కెప్టెన్‌గా ఎదిగాడు. 2018లో 42.57 సగటుతో మంచి ప్రదర్శన కనబర్చాడు. 146 వన్డేలాడిన చండీమల్‌ను పక్కనపెట్టడం సాహసమనే చెప్పాలి.