కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రీడాటోర్నీలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే మ్యాచ్‌ల నిర్వహణకు కొన్ని దేశాలు పూనుకుంటున్నాయి. తాజాగా క్రీడా కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో జూన్ 27 నుంచి '3 టీమ్ క్రికెట్' అనే వినూత్న పోటీ నిర్వహించనుంది సఫారీ క్రికెట్ బోర్డు. అయితే ఇందులో జరిగే ఒకే మ్యాచ్‌లో మూడు జట్లు పోటీ పడటం గమనార్హం. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించిన నివేదిక ఆధారంగా జూన్ 27న నిర్వహించనున్న టోర్నీలో మూడు జట్లు పోటీ పడనున్నాయి. లాక్డౌన్ తర్వాత దక్షిణాఫ్రికాలో ప్రత్యక్ష ప్రసారమయ్యే తొలి క్రీడాకార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ ఫార్మాట్లో తొలి ప్రయత్నంగా స్వదేశానికి చెందిన 24 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఒక్కొక్క జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే భాగం కానున్నారు.
ఒకే మ్యాచ్‌లో మూడు టీమ్‌లు
సాలిడారిటీ కప్ కోసం ఈగల్స్, కింగ్ ఫిషర్స్, కైట్స్.. ఈ మూడు జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ జట్టు కెప్టెన్‌గా రబాడా, కైట్స్ టీమ్‌కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్ డికాక్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్ క్రికెట్ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్.
"ప్రపంచవ్యాప్తంగా టోర్నీలన్నీ ఆగిపోవడం వల్ల క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అదే విధంగా క్రికెటర్లందరూ ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా క్రికెట్ దక్షిణాఫ్రికా సాలిడారిటీ కప్ అంటూ వినూత్న పోటీని నిర్వహించబోతోంది. ఈ ఫార్మాట్ కోసం పనిచేయడం ఆసక్తిగానూ.. ఆనందంగానూ ఉంది.".
- గ్రేమ్ స్మిత్, క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్