తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీ క్రికెట్లో సంక్షోభం.. ఐపీఎల్​పై ప్రభావం చూపేనా? - Cricket South Africa, ipl news

అవినీతి, అక్రమాల ఆరోపణలతో దక్షిణాఫ్రికా క్రికెట్​ సంక్షోభంలో పడింది. సఫారీ క్రికెట్​ బోర్డును ఆ దేశ ఒలింపిక్‌ కమిటీ నియంత్రణలోకి తీసుకుంది. పరిస్థితి మారకపోతే బోర్డుపై ఐసీసీ నిషేధం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్​పై ఇది ప్రభావం చూపిస్తుందా..? దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లీగ్​లో పాల్గొంటారా..? అనేది ఓసారి చూద్దాం.

south africa cricket board latest news
దక్షిణాఫ్రికా క్రికెట్లో సంక్షోభం.. ఐపీఎల్​పై ప్రభావం..?

By

Published : Sep 12, 2020, 7:59 AM IST

కరోనా మహమ్మారి అనంతరం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న క్రికెట్లో ఒక్కసారిగా అలజడి! దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. అవినీతి, అక్రమాల దర్యాప్తు నేపథ్యంలో క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బోర్డును.. దక్షిణాఫ్రికా స్పోర్ట్స్‌ కాన్ఫెడరేషన్‌ అండ్‌ ఒలింపిక్‌ కమిటీ (ఎస్‌ఏఎస్‌సీఓసీ) తమ నియంత్రణలోకి తీసుకుంది. తక్షణం పదవుల నుంచి తప్పుకోవాలని బోర్డు సభ్యులను ఎస్‌ఏఎస్‌సీఓసీ ఆదేశించింది.

"సీఎస్‌ఏలో జాతివివక్ష, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఎన్నో అంశాలు క్రికెట్‌ ప్రతిష్ఠను దిగజార్చాయి" అంటూ సెప్టెంబర్​ 8న జరిగిన సమావేశంలో ఎస్‌ఏఎస్‌సీఓసీ బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ఏ వ్యవహారాలపై దర్యాప్తు కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. దక్షిణాఫ్రికాలో క్రీడలపై నియంత్రణ అధికారం ఎస్‌ఏఎస్‌సీఓసీదే. తాజా నిర్ణయంతో సీఎస్‌ఏ రోజువారీ కార్యకలాపాలకు సీఈఓ కుగాండ్రీ గోవేందర్‌, కంపెనీ కార్యదర్శి వెల్ష్‌ గ్వాజా, తాత్కాలిక సీసీఓ థేమీ తెంబు దూరం కానున్నారు. దీంతో దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ నిర్వహణ.. వ్యవహారాలు చూసేందుకు ఒక్కరు కూడా లేరిప్పుడు.

పరిపాలన వైఫల్యం, అవినీతి, జాతి వివక్ష ఆరోపణలతో పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్న సీఎస్‌ఏను ఎస్‌ఏఎస్‌సీఓసీ నిర్ణయం మరింత అగాధంలోకి నెట్టింది. తీవ్రమైన దుష్ప్రవర్తనపై ఫోరెన్సిక్‌ నివేదికలో ఆధారాలు లభించడం వల్ల గతనెలలో మాజీ సీఈఓ తబాంగ్‌ మోన్రోపై వేటు పడింది. అనంతరం తాత్కాలిక సీఈఓ జాక్వెస్‌ ఫాల్‌, అధ్యక్షుడు క్రిస్‌ నెంజాని రాజీనామా చేశారు.

ఈనెల 5న జరగాల్సిన ఏజీఎంను సీఎస్‌ఏ ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు విమర్శించారు. అయితే ఎస్‌ఏఎస్‌సీఓసీ నిర్ణయాన్ని అంగీకరించమని సీఎస్‌ఏ స్పష్టంచేసింది. క్రికెట్‌ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికీ ఎస్‌ఏఎస్‌సీఓసీతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపింది.

ఐసీసీ చర్యలు తీసుకుంటుందా?:

ఐసీసీ నియమావళి ప్రకారం క్రికెట్‌ బోర్డుల రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వం జోక్యం ఎక్కువ కావడం వల్లే నిరుడు జింబాబ్వే క్రికెట్‌పై ఐసీసీ కొద్దికాలం నిషేధం విధించింది. ఎస్‌ఏఎస్‌సీఓసీ కూడా ప్రభుత్వ సంస్థే కాబట్టి సీఎస్‌ఏపై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉంది. జాతి వివక్ష కారణంగా 1970 నుంచి 1991 వరకు దక్షిణాఫ్రికాపై తొలిసారిగా వేటు పడింది.

ఐపీఎల్‌పై ప్రభావం:

ఎస్‌ఏఎస్‌సీఓసీ తాజా నిర్ణయం ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందా? లేదా? అన్నది తెలియరాలేదు. ఇప్పటి వరకైతే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఐసీసీ నిషేధం విధించినా అంతర్జాతీయ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశ సరిహద్దులు మూసేశారు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ సిరీస్‌లేవీ లేవు. దేశవాళీ క్రికెట్‌ జరిగేది కూడా అనుమానమే.

సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​ ప్రారంభం కానుంది. ఇందులో సఫారీ ఆటగాళ్లు డేల్​ స్టెయిన్​, క్రిస్​ మోరిస్​, డుప్లెసిస్​, ఇమ్రాన్​ తాహిర్​, డేవిడ్​ మిల్లర్​, లుంగి ఎంగిడి, ఆన్రిచ్​ నోర్తజే వంటి ఆటగాళ్లు ఆయా జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు.

ABOUT THE AUTHOR

...view details