దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లతో మర్యాదగా మెలగాలని ఆ బోర్డు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ ఆ జట్టు అభిమానులను కోరాడు. కేప్‌టౌన్ వేదికగా 2018 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరూ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఫలితంగా క్రికెట్ ఆస్ట్రేలియా వీరిద్దరికి ఏడాదిపాటు నిషేధం విధించింది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో నిషేధం పూర్తిచేసుకున్న వీరు ఈ టోర్నీతో పునరాగమనం చేశారు.
ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపిస్తాం..
ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్, యాషెస్ సిరీస్ సందర్భంగా పలువురు వీక్షకులు ఈ ఆసీస్ ఆటగాళ్లను ఎద్దేవా చేశారు. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత వార్నర్, స్మిత్ దక్షిణాఫ్రికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఎవరైనా మళ్లీ వీరిని అవమానిస్తారని భావించిన క్రికెట్ దక్షిణాఫ్రికా తమ అభిమానులకు ఈ విధంగా విజ్ఞప్తి చేసింది. "దక్షిణాఫ్రికా అభిమానులకు ఒకటే విన్నవిస్తున్నా.. మనం ప్రత్యర్థులను గౌరవించాలి. అంతకుమించి ఇతర విషయాల జోలికి వెళ్లొద్దు. మైదానంలో మాత్రమే పోటీ ఉండాలి. బయట మనకు అలా ఉండకూడదు. క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన ఉండకూడదు" అని జాక్వెస్ ఫాల్ తెలిపాడు. గతంలో జరిగిన దానికి ఇప్పుడీ క్రికెటర్లను అవమానించ వద్దని తెలిపాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తే స్టేడియం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించాడు.
ఇదీ చూడండి.. 'టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరడమే మా లక్ష్యం'