దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ తెందుల్కర్‌ను డకౌట్ చేయడమే తన కెరీర్‌ను మార్చిందని పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. 2008 రంజీ సీజన్లో సచిన్‌ను ఇన్‌స్వింగ్ బంతితో ఔట్ చేయడం వల్ల అందరి దృష్టి 18 ఏళ్ల భువీ మీద పడింది. అప్పటి వరకు దేశవాళీ క్రికెట్లో సచిన్ డకౌట్ కాలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో ఈ విషయంపై భువీ స్పందించాడు.
"డ్రెస్సింగ్ రూమ్ నుంచి సచిన్ మైదానంలోకి వస్తున్నప్పుడు నేను బౌలింగ్ మార్క్ దగ్గర ఉన్నా. అతణ్ని అలా చూస్తూ ఉండిపోయా. సచిన్‌ను ఔట్ చేశాక ఆ విషయాన్ని నమ్మలేకపోయా. వికెట్ తీయడం నాకేమీ కొత్త కాదు.. కానీ నేను ఔట్ చేసింది తెందుల్కర్‌ని అని గుర్తించడానికి కొంచెం సమయం పట్టింది. నేను సాధించిన పెద్ద ఘనత ఇది. అప్పటి నుంచే జనం నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నా కెరీర్లో నేనేమీ సాధించినా అంతా ఆ వికెట్ తర్వాతే. అప్పటివరకు అనామక ఆటగాడిగా ఉన్న నాపై అందరి దృష్టి పడింది. ఎవరా కుర్రాడు అని ఆసక్తిగా చర్చించుకున్నారు"