డిసెంబర్ 1, 2006.. భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఏకైక టీ20 మ్యాచ్ ఆడింది ఈరోజే. అదే టీమిండియాకు తొలి అంతర్జాతీయ టీ20 కావడం విశేషం.
తొలిసారిఅంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడింది టీమిండియా. ఈ ఫార్మాట్లో ప్రపంచ వ్యాప్తంగా ఇది పదో మ్యాచ్. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యం వహించాడు. ఈ జట్టులో సచిన్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దినేశ్ కార్తీక్ 31* పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకున్నాడు.
మ్యాచ్ సాగిందిలా...
గ్రేమ్ స్మిత్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా.. సచిన్, హర్భజన్, శ్రీశాంత్ తలో వికెట్ సాధించారు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభం అంతగా కలిసిరాలేదు. సచిన్ 10 పరుగులకే ఔటయ్యాడు. సెహ్వాగ్(34) మరో బ్యాట్స్‌మన్ మోంగియాతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మోంగియా, దినేశ్ కార్తీక్ కాసేపు పోరాడారు. ఆఖర్లో మోంగియా ఔటైనా... రైనా వచ్చి మ్యాచ్ ముగించేశాడు.