కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్-2020 సీజనూ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఆ దేశంలో రాకపోకలు నిలిపేసిన క్రమంలో టోర్నీని వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టోర్నీని నిర్వహించటానికి పూర్తి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
"ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణ కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికనే ఫాలో అవుతాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల ఆకస్మిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అయితే వాటి అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ నిర్వహణకు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సహా నిపుణుల సలహాలు తీసుకుంటాం."