ప్లే ఆఫ్ బెర్త్‌ను పక్కా చేసుకున్న చెన్నై అగ్రస్థానాన్ని పదిల పరచుకోవాలనుకుంటోంది. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ పరువు కోసం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ రెండింటి మధ్య మొహాలి వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ముంబయిపై ఓటమి అనంతరం వెంటనే పుంజుకుంది చెన్నై సూపర్‌కింగ్స్. దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను విజయవంతంగా ముగిద్దామనుకుంటోంది.
చెన్నై సూపర్‌కింగ్స్..
13 మ్యాచ్‌లు ఆడిన చెన్నైతొమ్మిదింట గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దిల్లీపై జరిగిన మ్యాచ్‌లో ధోని, సురేశ్ రైనా చెలరేగి జట్టుకు విజయాన్నందించారు. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను 99 పరుగులకే పరిమితం చేసింది చెన్నై బౌలింగ్ దళం. ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజాలు తమ స్పిన్ మాయాజాలంతో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు.
ధోని, రైనా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, డుప్లెసిస్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మొహాలిలోనూ సత్తా చాటాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో తాహిర్, హర్భజన్, జడేజా నిలకడగా రాణిస్తూ.. ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
సీజన్ ఆరంభంలో ధాటిగా ఆడి.. విజయాలు దక్కించుకున్న పంజాబ్ తర్వాత వెనుకబడింది. 13 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింటిలోనే గెలిచి ప్లే ఆఫ్‌కు దూరమైంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాకు 183 పరుగుల లక్ష్యాన్నిచ్చినా.. గెలవలేకపోయింది. రైడర్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(65), క్రిస్‌లిన్(46) విజృంభించి పంజాబ్‌కు విజయాన్ని దూరం చేశారు.
ఈ సీజన్లో ఓపెనర్లు క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ రాణించినప్పటికీ జట్టును ప్లే ఆఫ్ చేర్చలేకపోయారు. నికోలస్ పూరన్, మయాంక్ అగర్వాల్, సామ్ కరన్ మిడిల్ ఆర్డర్లో ఆకట్టుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో ఎక్కువగా అశ్విన్, షమీపైనే ఆధారపడుతోంది పంజాబ్ జట్టు. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గెలిచి సీజన్‌ను ఘనంగా ముగిద్దామనుకుంటోంది పంజాబ్.
జట్ల అంచనా..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్..
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, సిమ్రన్ సింగ్(కీపర్), మురుగన్ అశ్విన్, ముజిబుర్ రెహమాన్, షమీ.
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (సారథి), హార్భజన్ సింగ్, వాట్సన్, డ్వేన్ బ్రావో, రైనా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్.
ఇవీ చూడండి.. నెటిజన్లతో శ్రేయస్ అయ్యర్ చిట్‌చాట్