భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి గాల్వన్‌లో జరిగిన ఘర్షణ జరిగింది. అనంతరం ఈ విషయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ జట్టు వైద్యుడిని చెన్నై సూపర్‌కింగ్స్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై మంగళవారం, డా.మధు తొట్టప్పిల్లిల్.. "శవపేటికలపై 'పీఎం కేర్స్' స్టిక్కర్ వస్తుందో లేదో చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" అని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అయితే మధు వ్యక్తిగత ట్వీట్‌కు, ఫ్రాంఛైజీకి ఎటువంటి సంబంధం లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది.
"డా.మధు ఏ విధమైన ట్వీట్ చేశారో చెన్నై సూపర్‌కింగ్స్‌కు అవగాహన లేదు. కానీ, జట్టు వైద్యుడి స్థానం నుంచి అతడిని సస్పెండ్ చేస్తున్నాం. ఈ విషయమై యాజమాన్యం ఎంతగానో చింతిస్తుంది"
- చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు యాజమాన్యం
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య సరిహద్దు వైరం మరింత ముదిరింది. తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా కవ్వింపు చర్యలు.. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇందులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. 43 మంది చైనా సైనికులూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మూడు రోజుల తర్వాత అంటే మార్చి 27వ పీఎం-కేర్స్ (ప్రధానమంత్రి పౌర సహాయ అత్యవసర నిధి)ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి... మీ త్యాగం అమరం.. వీరజవాన్లకు క్రీడాకారుల నివాళి