ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల బలహీనతను భారత్ సరిగానే అంచనా వేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ తెలిపాడు. స్పిన్ భయాలను టీమ్ఇండియా తమకు అనుకూలంగా మలుచుకుందని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్ 11, రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లతో సత్తా చాటారు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
" పింక్ టెస్టు అనంతరం మ్యాచ్ గురించి మాట్లాడిన కోహ్లీ.. 'వింతగా' అనిపించిందని తెలిపాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు ఈ పదం సరిగ్గా సరిపోతుంది. స్పిన్‌ను ఆడటంలో జో రూట్ మినహా ఇంగ్లాండ్ జట్టంతా విఫలమైన విషయాన్ని రెండో టెస్టులోనే టీమ్ఇండియా గమనించింది. అందుకే మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల అసమర్థతను సరిగ్గా గ్రహించిన భారత్.. అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది."