ధోనీ మళ్లీ ఎప్పుడు పునరాగమనం చేస్తాడా..? అని వేచి చూస్తున్న బషీర్‌కు అతను అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పాడన్న వార్త శరాఘాతంలా తగిలింది.
'ధోనీ వీడ్కోలు పలికాడు.. ఇక నేనూ రిటైర్ అవుతా' - ధోనీ రిటైర్‌మెంట్ వార్తలు
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్‌లోనూ అతణ్ని చాలా మంది అమితంగా ఇష్టపడతారు. అలాంటివాళ్లలో మహ్మద్ బషీర్ బొజాయ్ ముందు వరుసలో ఉంటాడు. ధోనీ అని పేరున్న జెర్సీని వేసుకుని.. అతని పేరును ముఖాన రాసుకుని.. మహీ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా అక్కడ ప్రత్యక్షమవుతాడు బషీర్ అలియాస్ 'చాచా చికాగో'. ధోనీ అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించడం వల్ల వేదనకు గురైన ఈ వీరాభిమాని.. తానూ రిటైర్ అవుతున్నానని, ఇక క్రికెట్ చూడనని ప్రకటించాడు.
"ధోనీ రిటైర్ అయ్యాడు. ఇక అభిమానిగా నేనూ రిటైర్ అవుతా. మహీ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి అతని ఆట చూసేవాడిని. ఇక క్రికెటే చూడను. అతణ్ని ఎంతో ఆరాధించా.. నన్నూ అతనెంతో అభిమానించాడు. గొప్ప ఆటగాళ్లందరూ ఏదో రోజు వీడ్కోలు చెప్పాల్సిందే. కానీ ధోనీ ఆటకు గుడ్‌బై చెప్పడం ఎంతో వేదనకు గురి చేస్తోంది. ఘనంగా రిటైర్ కావాల్సిన అర్హతలు ఉన్నవాడతను. కరోనా తగ్గిన తర్వాత ధోనీ ఇంటికి వెళ్లి అతణ్ని అభినందిస్తాను. ఐపీఎల్‌లో అతని ఆటను చూడాలని ఉంది కానీ ప్రస్తుతం ప్రయాణాలపై ఆంక్షలు ఉండడం వల్ల సాధ్యం కావడం లేదు" అని బషీర్ పేర్కొన్నాడు.
2011 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ బ్లాక్‌బస్టర్ సెమీఫైనల్‌కు టికెట్ దొరక్కపోవడం వల్ల తీవ్ర నిరాశలో ఉన్న ఈ 65 ఏళ్ల వీరాభిమానికి.. టిక్కెట్ ఇప్పించి మహీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అక్కడి నుంచి వారి మధ్య బంధం మొదలైంది. ఆ తర్వాత ధోనీ చాలాసార్లు 'చాచా చికాగో'కు టికెట్లు పంపించాడు.