తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ లోటు సరిదిద్దుకోకపోతే టీమ్​ఇండియాకు కష్టమే - ఆసీస్​ సిరీస్​లో టీమ్​ఇండియా ఫీల్డింగ్​ విఫలం

ఫీల్డింగ్​లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ సేన.. ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​లో పూర్తిగా విఫలమైంది. దీంతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇకపై ఈ లోటును సరిదిద్దుకోకపోతే టెస్టుల్లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిరావొచ్చు.

kohli
కోహ్లీ

By

Published : Dec 9, 2020, 6:52 AM IST

'క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌' - క్రికెట్లో ఎప్పుడూ వినిపించే మాట! ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. 1999 ప్రపంచకప్‌ సెమీస్‌ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ వా క్యాచ్‌ను గిబ్స్‌ విడిచిపెట్టడం వల్ల దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్పే దూరమైంది! వన్డేల్లో రెండో ర్యాంకు.. టీ20ల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌ కూడా క్యాచ్‌ల విలువ మరిచిపోయినట్లుంది! ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లున్న టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్‌ల మీద క్యాచ్‌లు వదిలేస్తూ, ఫీల్డింగ్‌లో తడబడుతూ విమర్శలు ఎదుర్కొంటోంది. అనేక క్యాచ్‌లు వదిలేసిన కంగారూలతో పరిమిత ఓవర్ల పోరులో ఎలాగో నెగ్గొకొచ్చిన భారత్‌.. ఫీల్డింగ్‌ను సరిదిద్దుకోకపోతే టెస్టుల్లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిరావొచ్చు.

ప్రస్తుత టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్లలో అత్యధికులు ఈసారి ఐపీఎల్‌లో ఆడినవాళ్లే. రెండున్నర నెలల పాటు అత్యుత్తమ ఆటతీరు, ఫీల్డింగ్‌తో అదరగొట్టిన వాళ్లే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, మనీష్‌ పాండే లాంటి ఆటగాళ్ల ఫీల్డింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఘనత కోహ్లి బృందానిదే! అయితే ఆసీస్‌ పర్యటనలో మాత్రం టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ పూర్తిగా గాడితప్పింది. మొదట వన్డే సిరీస్‌.. అనంతరం టీ20 టోర్నీలో చాలా క్యాచ్‌లు వదిలేశారు. ఫీల్డింగ్‌ వైఫల్యాలకు లెక్కేలేదు. ఆసీస్‌ పర్యటనలో తొలి మ్యాచ్‌ నుంచే క్యాచ్‌లు వదిలేయడం అలవాటు చేసుకున్న భారత ఆటగాళ్లు మూడో టీ20లోనూ దాన్ని కొనసాగించారు.

చాహర్​

ఘోర వైఫల్యం

మంగళవారం నాటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ రెండు సార్లు అందించిన క్యాచ్‌ల్ని దీపక్‌ చాహర్‌, చాహల్‌ నేలపాలు చేశారు. మ్యాక్స్‌వెల్‌ 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు చాహర్‌ క్యాచ్‌ చేజార్చాడు. చాహల్‌ క్యాచ్‌ వదిలినప్పుడు మ్యాక్స్‌వెల్‌ 53 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక స్టీవ్‌ స్మిత్‌ను స్టంపౌట్‌ చేయడంలో కేఎల్‌ రాహుల్‌ది ఘోరమైన వైఫల్యం. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ వికెట్ల ముందుకొచ్చి ఆడగా బ్యాట్‌కు బంతి తాకలేదు. బంతిని ఒడిసిపట్టుకోలేకపోయిన రాహుల్‌.. స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని చేజార్చాడు. టీమ్‌ఇండియా అత్యుత్తమ ఫీల్డర్లు కోహ్లి, హార్దిక్‌లు రెండో టీ20లో సునాయాసమైన క్యాచ్‌ల్ని విడిచిపెట్టడం గమనార్హం.

మాథ్యూ వేడ్‌ అందించిన క్యాచ్‌ల్ని పాండ్య, కోహ్లి నేలపాలు చేశారు. కోహ్లి అంత తేలికైన క్యాచ్‌ను విడిచిపెడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అయితే క్యాచ్‌ నేలపాలైనా.. స్మిత్‌తో సమన్వయ లోపం కారణంగా వేడ్‌ను అదే బంతికి కోహ్లి రనౌట్‌ చేశాడు. 8వ ఓవర్లోనే 58 పరుగులకు చేరుకున్న వేడ్‌.. కోహ్లి ఫీల్డింగ్‌ వైఫల్యంతో బతికిపోయుంటే మరెంత విధ్వంసం సృష్టించేవాడో! అదే జరిగుంటే రెండో టీ20 టీమ్‌ఇండియాకు దూరమయ్యేదేమో!

మొదటి టీ20 పోరులో ఫించ్‌ క్యాచ్‌ను మనీష్‌ పాండే, షార్ట్‌ క్యాచ్‌ను కోహ్లి విడిచిపెట్టారు. అంతకుముందు వన్డే సిరీస్‌లోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తడబడ్డారు. తొలి వన్డేలో క్రీజుకు ఎంతో దూరంలో ఉన్న ఫించ్‌ను సునాయాసంగా రనౌట్‌ చేసే అవకాశాన్ని రవీంద్ర జడేజా వృథా చేశాడు. ఆ సమయంలో ఒక్క పరుగుతో ఉన్న ఫించ్‌ అనంతరం సెంచరీ సాధించాడు. డేవిడ్‌ వార్నర్‌తో కలిసి 156 పరుగులు, స్మిత్‌తో కలిసి 108 పరుగులు జోడించి ఆసీస్‌ భారీస్కోరు (374/6)కు బాటలు వేశాడు. అదే మ్యాచ్‌లో కేరీ ఆడిన షాట్‌ కోహ్లి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లగా.. ఆసీస్‌కు మూడు పరుగులు వచ్చాయి. రెండో వన్డేలో లబుషేన్‌ క్యాచ్‌ను జడేజా విడిచిపెట్టాడు. ఫీల్డింగ్‌ వైఫల్యంతో బౌండరీ వెళ్లడానికి కారణమయ్యాడు. మూడో వన్డేలో ఫించ్‌ 20ల్లో ఉన్నప్పుడు అందించిన క్యాచ్‌ల్ని ధావన్‌, బుమ్రాలు వదిలేశారు. అనంతరం అతడు 75 పరుగులు చేశాడు.

కోహ్లీ

దారుణం

కొన్నిసార్లు అదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నా.. మొత్తంగా వన్డే, టీ20 సిరీస్‌లలో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ వైఫల్యాలు ఘోరమనే చెప్పాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించిన భారత జట్టు మునుపెన్నడూ లేనంత చెత్త ఫీల్డింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటోంది. మూడో టీ20లో భారత్‌ ఫీల్డింగ్‌ దారుణంగా ఉందని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ సైతం ఫీల్డింగ్‌ వైఫల్యాల్ని ఆక్షేపించాడు. "జట్టులో అత్యుత్తమ ఫీల్డర్లు ఉన్నా సునాయాస క్యాచ్‌లు అందుకోలేకపోతున్నారు. ఫీల్డింగ్‌కు కావాల్సిందల్లా ఏకాగ్రత. మైదానంలో భారత ఆటగాళ్ల ఏకాగ్రత స్థాయి తగ్గిందని గట్టిగా నమ్ముతున్నా. ఫీల్డింగ్‌కు ప్రత్యేకంగా కోచ్‌.. సహాయక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయినా ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఫీల్డింగ్‌ కోచ్‌ను ప్రశ్నించాలి" అని అజహర్‌ ఆగ్రహం వ్యక్తంజేశాడు.

ఇదీ చూడండి :'నటరాజనే​ బలం.. టీ20 ప్రపంచకప్​కు కీలకం​'

ABOUT THE AUTHOR

...view details