ప్రపంచవ్యాప్తంగా కరోనా(కొవిడ్ 19) వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 19 నుంచి శ్రీలంకతో తలపడే టెస్టు సిరీస్‌లో.. ఆ ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని ఇంగ్లాండ్ సారథి జోరూట్ మంగళవారం స్పష్టం చేశాడు.
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు అక్కడ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. పది మంది ఆటగాళ్లతో పాటు కొందరు సహాయక సిబ్బంది వాంతులు, జ్వరంతో ఇబ్బందులు పడ్డారు. అందువల్లే తాజాగా షేక్ హ్యాండ్ వద్దనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు జోరూట్.
" దక్షిణాఫ్రికా పర్యటనలో మా జట్టు అనారోగ్యానికి గురయ్యాక.. వీలైనంత మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే అధికారికంగా మా వైద్య బృందం జట్టుకు పలు సూచనలు చేసింది. ప్రమాదకర బ్యాక్టీరియా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాబట్టి.. ఇతరులతో చేతులు కలపబోం. అందుకు బదులు ఫిస్ట్ బంప్స్ పద్ధతిని పాటిస్తాం. అలాగే మేం తరచూ చేతులు కడుక్కొని శుభ్రత పాటిస్తున్నాం. మరోవైపు కరోనా విజృంభిస్తున్నా ఈ సిరీస్ నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే సమాచారం లేదు. ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారి సూచన మేరకే మేం నడుచుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇంగ్లాండ్-శ్రీలంక టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతుంది"