ఐపీఎల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 12వ ఓవర్లో అశ్విన్ బ్యాట్స్‌మెన్‌ని మన్కడింగ్ పద్ధతిలో ఔట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇలా ఔట్ చేయడం ఐపీఎల్లో మొదటిసారి..!
జయపుర వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్ రనౌట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఔట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
12 ఓవర్లో ఐదో బాల్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు అశ్విన్. చేతిలోంచి బంతి ఇంకా వదలక ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బట్లర్ ముందుకు కదిలాడు. అశ్విన్ అతడిని గమనించి మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరి వాదన. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అశ్విన్‌పై విమర్శలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.
మన్కడింగ్ అంటే ఏంటి..?
నాన్ స్ట్రైకర్ స్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్ బౌలర్ బంతి వేయకముందే క్రీజు దాటితే... అపుడు బౌలర్ బంతిని వేయకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను గిరాటేయొచ్చు. సాంకేతికంగా దీనిని ఔట్‌గా పరిగణిస్తారు. కానీ ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురి క్రికెట్ అభిమానులు, పండితుల వాదన.