ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్ధం 'బుష్ఫైర్ క్రికెట్ బాష్' పేరిట ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది ఆసీస్ బోర్డు. సిడ్నీ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ తొలుత శనివారం నిర్వహించాలనుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మెల్బోర్న్కు మార్చి.. ఆదివారానికి ఆటను వాయిదా వేశారు. ఇందులో పాంటింగ్ జట్టుకు సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఒకవైపు బ్యాటింగ్‌కు 10 ఓవర్లు ఇవ్వనున్నారు. ఇందులో 5 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. బౌలర్లకు ఓవర్ లిమిట్ లేదు. బ్యాట్స్‌మన్ తొలి బంతికే ఔటైతే దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఫీల్డింగ్‌లో జట్టులోని ఎవరితోనైనా మార్పులు చేసుకోవచ్చు. మ్యాచ్ తేదీ మార్పు వల్ల మైఖేల్ క్లార్క్, బ్యాట్స్‌మన్ మైఖేల్ హస్సీ సహా పలువురు మహిళా క్రీడాకారిణులు మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.
పాంటింగ్, గిల్‌క్రిస్ట్ సభ్యులు వీళ్లే...
పాంటింగ్ ఎలెవన్‌లో బ్రయాన్‌లారా, వసీం అక్రమ్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ లాంటి స్టార్లు ఆడుతున్నారు. ఈ జట్టులో మహిళా క్రికెటర్ ఎలిస్ విలాని కూడా ఉండనుంది.
మొదట గిల్లీ ఎలెవన్‌కు షేన్‌వార్న్ కెప్టెన్ అనుకున్నా.. అతని స్థానంలో గిల్‌క్రిస్ట్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ జట్టులో యువరాజ్‌సింగ్, వాట్సన్, హాడ్జ్, సైమండ్స్, కోట్నీ వాల్ష్ తదితరులు ఆడనున్నారు.
దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి..
ఈ మ్యాచ్‌లో దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి బరిలోకి దిగుతోంది. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఫోబే లిచ్‌ఫీల్డ్‌కు మాజీలతో ఆడే ఛాన్స్ దక్కించుకుంది. దేశవాళీ లీగ్‌ల్లో రాణిస్తోన్న ఈ చిన్నారి పేరును.. ఆస్ట్రేలియా మాజీ అలెక్స్ బ్లాక్వెల్ సూచించినట్లు తెలుస్తోంది. స్టార్లతో కలిసి ఆడే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేసింది ఫోబే.
16 ఏళ్ల ఫోబే లిచ్‌ఫీల్డ్