క్రీడల్లో ఏ ఆటగాడికైనా శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. క్రికెట్లో వీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వెన్ను గాయానికి చికిత్స కారణంగా దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైన టీమిండియా పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా... నేడు శ్రీలంకతో జరగనున్న టీ20 మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సమయంలో పెద్దగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేదని చెప్పిన ఈ క్రికెటర్... మానసికంగా మెరుగయ్యేందుకు ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పుకొచ్చాడు.
కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపానని, ఫిట్నెస్ను కాపాడుకుంటూ ముందుకు సాగానని చెప్పాడు. విశ్రాంతి తీసుకున్నా బౌలింగ్‌లో వాడి తగ్గలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం వికెట్ల దాహంతో ఉన్నట్లు వెల్లడించాడు. తొలి టీ20 ముందు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న బుమ్రా... యార్కర్లలో, లైన్ అండ్ లెంగ్త్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నుంచి చాలా సలహాలు తీసుకున్నాడు. యార్కర్లను వేయడం, క్యాచ్‌లు పట్టడం వంటి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు.