బ్రిస్బేన్ టెస్టులో ఆడే అవకాశం లభించనందున స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్రంగా నిరుత్సాహపడి ఉంటాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అన్నాడు. 2019 ఆస్ట్రేలియా పర్యటనలో కుల్దీప్ అద్భుతంగా రాణించినా అతడిని యాజమాన్యం పక్కనపెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు.
"కుల్దీప్ చాలా నిరాశ చెంది ఉంటాడు. చెందాలి కూడా. గత ఆస్ట్రేలియా పర్యటన ముగిసే నాటికి భారత్‌కు అతడే నం.1 స్పిన్నర్. నాకు తెలిసి అప్పటి నుంచి అతడు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. జట్టులో ఐదుగురు బౌలర్లు ఉన్నప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల వైపు చూస్తారు. కానీ యాజమాన్యం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు. మరో స్పిన్నర్ ఉంటే బౌలింగ్ లైనప్‌లో సమం అయ్యేది."