కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబరు 15 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ప్రాణాంతక కరోనా వల్ల దీనిని వాయిదా లేదంటే రద్దు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. టోర్నీ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. తగు జాగ్రత్తలు తీసుకుని అనుకున్న తేదీ ప్రకారం టోర్నీ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"టీ20 ప్రపంచకప్ వాయిదా లేదా రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. అవసరమైతే నెల రోజులు ముందుగానే టోర్నీలో ఆడే మిగతా దేశాల క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించి, ఛార్టర్డ్ విమానాల్లో దేశానికి తీసుకురండి. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచండి. అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించండి. అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వారిని ఆటకు అనుమతి ఇవ్వండి. క్రికెట్ ఆడేటప్పుడు సాధారణంగానే ఓ మీటరు భౌతిక దూరం పాటిస్తారు. కేవలం స్లిప్‌లో దూరం పాటించడం కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ దూరం పాటించేలా జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కనుక ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నీలు రద్దు చేయడమనేది సరైంది కాదు"