తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అనుమానాస్పద మృతి- ఇప్పటికీ ఓ మిస్టరీ

2007 ప్రపంచకప్​లో పసికూన ఐర్లాండ్​ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది పాకిస్థాన్​. అయితే పాక్​ ఓడిపోయిన కొన్ని గంటలకే జట్టు కోచ్​ బాబ్​ వూల్మర్ మృతి చెందడం యావత్​ క్రికెట్​ ప్రపంచాన్ని షాక్​కు గురిచేసింది. వూల్మర్​ మృతి ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

WC19: ఐర్లాండ్​ చేతిలో పాక్​ ఓటమి... కోచ్​ అనుమానాస్పద మృతి

By

Published : May 18, 2019, 5:30 AM IST

Updated : May 18, 2019, 10:43 AM IST

2007 ప్రపంచకప్​. ఆసియాలోని క్రికెట్​ అభిమానులకు చేదు అనుభవం మిగిల్చిన మెగా టోర్నమెంట్​. పసికూన బంగ్లాదేశ్​పై ఓటమి చవిచూసి లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది టీమ్​ఇండియా. మరో పసికూన ఐర్లాండ్​ చేతిలో ఘోర పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది పాకిస్థాన్​. అభిమానులు బాధలో ఉన్న సమయంలో ఓ ఘటన యావత్​ క్రికెట్​ ప్రపంచాన్నే కుదిపేసింది. అదే అప్పటి పాకిస్థాన్ కోచ్​ ​బాబ్​ వూల్మర్ మరణం.

అనుమానాస్పద రీతిలో...

2007, మార్చి 18... వెస్టిండిస్​లోని కింగ్​స్టన్​లో ఉన్న పెగాసస్​ హోటల్​. గది నం. 374లో పాక్​ కోచ్​ బాబ్​ వూల్మర్​ అనుమానాస్పద రీతిలో, రక్తపు మడుగులో బాత్​టబ్​లో పడి ఉన్నాడు. ఐర్లాండ్​ చేతిలో పాక్ ఘోరంగా పరాభవానికి గురైన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ​ గోడల మీద రక్తపు మరకలు ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి. 58 ఏళ్ల బాబ్​ ఎలా చనిపోయాడనేది క్రికెట్​ ప్రపంచాన్ని కలవరానికి గురిచేసిన అంశం.

బాబ్​ వూల్మర్​కు అభిమానుల నివాళి

ఎన్నో ప్రశ్నలు...

58 ఏళ్ల వూల్మర్​ మధుమేహానికి చికిత్స తీసుకునేవాడు. అందుకే మరణించాడా? ఆయన​ మృతికి బెట్టింగ్​ మాఫియాతో సంబంధం ఉందా? పసికూనపై ఓటమి భరించలేకే పాకిస్థాన్​ అభిమానుల్లో ఎవరైనా బాబ్​ను హత్య చేశారా? లేక ఇది అండర్​వరల్డ్​ పనేనా? పాకిస్థాన్​ జట్టు సభ్యుల్లో ఎవరైనా బాబ్​ను హత్య చేశారా? ఇవి బాబ్​ వూల్మర్​ అనుమానాస్పద మృతి అనంతరం క్రికెట్​ అభిమానులను కలవరపెట్టిన ప్రశ్నలు.

పోలీసు విచారణ...

ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగింది జమైకన్​ పోలీసు బృందం. బాబ్​ మృతదేహాన్ని పరిశీలించింది. పాక్​ క్రికెటర్ల నుంచి వాగ్మూలం నమోదు చేసింది. అనంతరం నివేదిక రూపొందించింది. పాక్​ కోచ్​ గొంతును గుడ్డతో నులిమారని, అందుకే వూల్మర్​ ఊపిరి అందక మరణించాడని ప్రకటించింది. అయితే ఈ ఘటనతో జమైకా గూండాలకు సంబంధం లేదని తేల్చింది.

ముగ్గురిపై అనుమానం...

మార్చి 24న పాకిస్థాన్ జట్టు...​ మాంటిగో బే నుంచి లండన్​కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇంజమామ్​, జట్టు సహాయ​ కోచ్​ ముస్తాక్​ అహ్మద్​, మేనేజర్​ తలత్​ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాగ్మూలాలపై సందేహాలు ఉన్నందుకే అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు. విచారణ అనంతరం ఆ ముగ్గురిని విడిచిపెట్టారు.

మేనేజర్​ తలత్​ అలీ, ఇంజమామ్​

పాక్​ జట్టుపై ప్రభావం..

బాబ్​ వూల్మర్​ మరణం అప్పటి పాకిస్థాన్​ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఘటన అనంతరం ఎదుర్కొన్న పరిస్థితులు తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనవని యూనిస్​ఖాన్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

" ఒకానొక పరిస్థితిలో జమైకన్​ అధికారులు మాతో ప్రవర్తించిన తీరు చాలా కోపం తెప్పించింది. మమ్మల్ని క్రికెటర్లలా కాకుండా ఒక నేరస్థుల్లా చూశారు"
యూనిస్​ ఖాన్​, పాక్​ మాజీ ఆటగాడు.

ఈ ఘటన జరిగిన మూడు నెలలకు బాబ్​ది సాధారణ మరణమేనని, ఎవరూ హత్య చేయలేదని ప్రకటించిన జమైకా పోలీసులు... కేసును మూసేశారు. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేక ఇప్పటికీ పాకిస్థాన్​ మాజీ కోచ్​ బాబ్​ వూల్మర్​ మృతి ఓ మిస్టరీ​గానే మిగిలిపోయింది.

Last Updated : May 18, 2019, 10:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details