లఖ్‌నవూ వేదికగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి తర్వాత పుంజుకోవాలని చూస్తోంది భారత మహిళల జట్టు. దాదాపు ఏడాది విరామం వచ్చినా ఆటపై పెద్దగా ప్రభావం ఉండదని కెప్టెన్ మిథాలీ రాజ్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పిన మాటలు నిజం కాలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాటింగ్ పిచ్‌పై మిథాలీ, కౌర్, దీప్తి శర్మ రాణించినప్పటికీ మిగితా బ్యాట్స్‌వుమెన్ విఫలమయ్యారు. జట్టుగా కలిసి ఆడటానికి కొంత సమయం పడుతుందని మ్యాచ్ అనంతరం కౌర్ అంగీకరించింది. చాలామంది తమ షాట్ ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలిపింది.
బలంగా సఫారీలు..
మరోవైపు సౌతాఫ్రికా జట్టు పూర్తి సన్నద్ధతతో పటిష్ఠంగా కనబడుతోంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్థాన్‌ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. షాబ్నిమ్ ఇస్మాయిల్ నేతృత్వంలోని పేస్ దళం బలంగా కనబడుతోంది.
బలమైన భారత స్పిన్ కూడా సౌతాఫ్రికా ఓపెనర్లు లిజాల్లే లీ, లారా వోల్వార్డ్ట్ ముందు తేలిపోయింది. అయితే మిథాలీ, పేసర్ జులన్ గోస్వామీ ప్రదర్శన సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే రెండో టెస్టుకు మిథాలీ సేన పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.