బిగ్‌బాష్ లీగ్ తొమ్మిదో సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది హెన్రిక్స్ సారథ్యంలోని సిడ్నీ సిక్సర్స్. వరుసగా రెండో ఏడాది ఫైనల్లో బోల్తాపడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది మెల్బోర్న్ స్టార్స్. సిడ్నీ వేదికగా జరిగిన తుదిపోరుకు వర్షం ఆటంకం కలిగించింది. ఫలితంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు.
జోష్ జోరు
మొదట బ్యాటింగ్ చేసిన సిక్సర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ జోష్ ఫిలిప్ 29 బంతుల్లో 52 పరుగులతో సత్తాచాటాడు. స్టీవ్ స్మిత్ 12 బంతుల్లో 21, జోర్డాన్ సిల్క్ 15 బంతుల్లో 27 పరుగులతో ఆకట్టుకున్నారు. స్టార్స్ బౌలర్లలో ఆడం జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండు, డేనియల్ వారెల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 117 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 12 ఓవర్లలో 97 పరుగులు మాత్రమే చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్ (10), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5), హ్యాండ్స్కోంబ్ (6) నిరాశపర్చారు. నిక్ లర్కిన్ 26 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయినా 19 పరుగుల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది మెల్బోర్న్ స్టార్స్. సిక్సర్స్ బౌలర్లలో నాథన్ లియోన్, స్టీవ్ ఓకీఫె రెండు, జోష్ హెజిల్వుడ్ ఒక వికెట్ సాధించారు.
సిడ్నీ సిక్సర్స్ బిగ్‌బాష్ లీగ్ తొలి సీజన్ (2011-12)లోనూ విజేతగా నిలిచింది. ఫలితంగా ఈ లీగ్ టైటిల్‌ను ఎక్కువ సార్లు సాధించిన రెండో జట్టుగా స్థానం సంపాదించింది. పెర్త్ స్క్రాచర్స్ మూడుసార్లు విజేతగా నిలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది.