తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 'ఎకానమీ' వీరులు

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం కాబోతోంది. బౌలర్లలో అత్యుత్తమ ఎకానమీ రేట్ కలిగిన ఐదుగురిలో సునిల్ నరేన్ మొదటిస్థానంలో ఉన్నాడు.

By

Published : Mar 17, 2019, 6:57 PM IST

నరేన్, కుంబ్లే, రషీద్, స్టెయిన్

వేసవి తాపాన్ని మరింత పెంచేందుకు ఐపీఎల్ 12వ సీజన్ సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో మజా తీసుకొచ్చే ఈ టోర్నీ మార్చి 23వ ప్రారంభం కానుంది. ఈ 11 సీజన్లలో అత్యుత్తమ ఎకానమీ రేట్ కలిగిన బౌలర్లను ఒకసారి గమనిద్దాం.

టాప్ 5 - డెయిల్ స్టెయిన్
దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డెయిల్ స్టెయిన్ అత్యుత్తమ ఎకానమీ రేట్ సాధించిన బౌలర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. తరచూ గాయాలతో బాధపడే ఈ బౌలింగ్ సంచలనం ఎల్లప్పుడూ మెరుగైన ప్రదర్శనతో పునరాగమనం చేస్తుంటాడు. ఐపీఎల్​లో కూడా మంచి ప్రదర్శనే కనబర్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 92 మ్యాచ్​లు ఆడి 90 వికెట్లు, 6.72 ఎకానమీతో ఐపీఎల్​లో ఐదో స్థానంలో ఉన్నాడు.

స్టెయిన్

టాప్ 4 - రషీద్ ఖాన్
ఆప్ఘానిస్థాన్ యువ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. వేగంగా బంతులు విసురుతూ బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. వరుసగా వికెట్లు తీస్తూ చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయగల సమర్థుడు. ఐపీఎల్​లో 31 మ్యాచ్​లు ఆడి 38 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకానమీ రేట్ 6.68గా ఉంది.

రషీద్ ఖాన్

టాప్ 3 - ముత్తయ్య మురళీధరన్
ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్. ఐపీఎల్​లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. మూడు జట్లకు (చైన్నై సూపర్ కింగ్స్, కొచ్చి టస్కర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 66 మ్యాచ్​ల్లో 63 వికెట్లు తీసి 6.67 ఎకానమీ రేట్​తో మూడో స్థానంలో ఉన్నాడు.

మురళీధరన్

టాప్ 2 - అనిల్ కుంబ్లే
2010లో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన కుంబ్లే అంతకు ముందు సంవత్సరం బెంగళూరు జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. అభిమానులు, సహచర ఆటగాళ్లు జంబుగా పిలుచుకునే ఈ లెగ్ స్పిన్నర్ పిచ్​పై అదనపు బౌన్స్ రాబడుతూ బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెడుతుంటాడు. ఐపీఎల్​లో మొత్తం 42 మ్యాచ్​లాడిన కుంబ్లే 45 వికెట్లు.. 6.57 ఎకానమీతో రెండో స్థానంలో ఉన్నాడు.

కుంబ్లే

టాప్ 1 - సునిల్ నరేన్
వెస్టిండీస్ ఆఫ్ స్పిన్ మాంత్రికుడు ఐపీఎల్​లో ప్రతి ఏడాది అదరగొడుతుంటాడు. కోల్​కతా నైట్ రైడర్స్ జట్టులో మ్యాచ్ విన్నర్​గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జట్టుకు వరంగా మారి 2012, 2014లో కోల్​కతా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బంతితోనే కాకుండా గతేడాది బ్యాటుతోనూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం 97 ఇన్నింగ్స్​ల్లో 112 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 6.53 తో ఐపీఎల్​లో అత్యుత్తమ బౌలర్లలో మొదటి స్థానంలో ఉన్నాడు.

నరేన్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మెక్​గ్రాత్ కూడా మంచి ఎకానమీ రేట్ సాధించాడు. మొత్తం 14 మ్యాచ్​ల్లో 12 వికెట్లు తీసి 6.61 ఎకానమీ రేట్ సాధించాడు. తక్కువ మ్యాచ్​లు ఆడినందు వల్ల ఇతడిని పరిగణలోకి తీసుకోలేదు.

12వ సీజన్​లో కూడా బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ సీజన్​లో ఏ బౌలర్ సంచలనంగా మారుతాడో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details