క్రికెట్.. జెంటిల్మన్ గేమ్ ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌కు దీటుగా బౌలర్లు కూడా చెలరేగేవాళ్లు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ.. పిచ్‌పై నిప్పులు చెరిగేవాళ్లు. క్రమేణా పవర్ ప్లే నిబంధనలు, ఫీల్డింగ్ ప్రతిబంధకాలతో క్రికెట్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గాధామంగా మారింది. గతంతో పోలిస్తే బౌలర్ల ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ ఈ దశాబ్దంలోనూ తమ పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు కొంతమంది బౌలర్లు. పాయింట్ల వారిగా వారిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
మిచెల్ స్టార్క్.. 9.5/10
ప్రస్తుత తరంలో అత్యుత్తమ వన్డే బౌలర్లలో ముందువరుసలో ఉన్నాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఈ దశకంలో 172 వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో పదునైన పేస్‌తో పాటు స్వింగ్ కూడా రాబడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో అతడు వేసే యార్కర్లకు బ్యాట్స్‌మెన్ చేతులేత్తెస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. 2015, 2019 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2015 మెగాటోర్నీలో అత్యధిక వికెట్లతో(22) మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
లసిత్ మలింగ.. 9/10
ఈ దశాబ్దంలో లీడింగ్ వికెట్ టేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ. 2010 జనవరి నుంచి 162 వన్డేల్లో 248 వికెట్లు తీసి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. 5 కంటే ఎక్కువ వికెట్లు 8 సార్లు తీసి ఎవరికి దక్కని ఘనత సాధించాడు మలింగ. ఈ కారణంగా అతడు ఈ దశాబ్దపు మేటి బౌలర్ల జాబితాలో చేరాడు. అయితే పదే పదే గాయాల బారిన పడడం, ఫిట్‌నెస్‌లేమితో రెండో స్థానానికే పరిమితమయ్యాడు.
ట్రెంట్ బౌల్ట్.. 9/10
ఆసీస్ జట్టులో స్టార్క్ ఎలాగో.. న్యూజిలాండ్‌కు ట్రెంట్ బౌల్ట్ ఆ రకంగా ఆకట్టుకుంటున్నాడు. 2012లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బౌల్ట్.. 165 వన్డేల్లో 25 సగటుతో 164 వికెట్లు తీశాడు. ప్రతి 5 ఓవర్లకు ఓ వికెట్ చొప్పున తీస్తూ వన్డే క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. 2015 ప్రపంచకప్‌లో కివీస్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ రపోషించాడు బౌల్ట్. అంతేకాకుండా ఈ దశాబ్దంలో న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలవడంలో ఇతడి పాత్ర ఎంతో ఉంది.
జస్ప్రీత్ బుమ్రా.. 8.5/10
ఈ దశాబ్దం రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసి.. అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. 2016లో తొలి వన్డే ఆడిన ఇతడు ఫార్మాట్ ఏదైనా.. ప్రదర్శనలో ఏమాత్రం తడబాటు లేకుండా సత్తాచాటుతున్నాడు. కేవలం 58 వన్డేలాడిన ఈ గుజరాత్ పేసర్ 21.88 సగటుతో 103 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవర్‌కు 4.49 పరుగులు ఇస్తూ.. ప్రతి 29 బంతులకో వికెట్ తీస్తున్నాడు.
రషీద్ ఖాన్.. 8.5/10
బుమ్రా తర్వాత ఈ దశాబ్దం రెండో అర్ధభాగంలో అరంగేట్రం చేసిన మరో బౌలర్ అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. తెలుపు బంతి క్రికెట్లో అత్యుత్తమ సగటుతో చరిత్ర సృష్టించాడు రషీద్. 18.54 సగటుతో 133 వికెట్లు తీసి ఎవరికి దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు. కొనేళ్లుగా అఫ్గానిస్థాన్ విజయాలతో దూసుకెళ్తోందంటే అందుకు రషీదే కారణం. టీ20ల్లో ఈ లెగ్ స్పిన్నర్ పిచ్ ఎలాంటిదైనా రెండు వైపులా బంతిని టర్న్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుంటాడు.