హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో బంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి 303 పరుగులు (414 బంతుల్లో: 30 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో తొలిసారి త్రిశతకం సాధించాడు.
ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగాల్.. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో నాలుగో స్థానంలో వచ్చిన తివారి... ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. తొలి రోజు శతకం బాదిన అతడు.. సోమవారం దానిని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. ఫలితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. పలువురు మాజీ క్రికెటర్లు, బోర్డుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
బంగాల్.. రెండోరోజు 151.4 ఓవర్ల వద్ద 635/7 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. జవీద్ అలీ(19), తన్మయ్ అగర్వాల్(10) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ ఇంకా 552 పరుగుల వెనుకంజలో ఉంది.
తివారి గతంలో బంగాల్ జట్టుకు సారథిగా ఉండేవాడు. గతేడాది ఆగస్టులో అభిమన్యు ఈశ్వరన్.. మూడు ఫార్మాట్లలోనూ అతడి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. తివారి టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. చివరగా 2015లో జింబాబ్వే పర్యటనలో కనిపించాడు. 2018 ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు. 2019, 2020 వేలంలో అతడిని ఎవరు కొనుక్కోలేదు.