తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్ ఓవర్​ ముందు సిగరెట్​ కాల్చిన స్టోక్స్​! - Ben Stokes

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో తొలిసారి వన్డే ప్రపంచకప్​ను ముద్దాడింది ఇంగ్లాండ్​. ఫైనల్లో న్యూజిలాండ్​పై జరిగిన పోరులో బౌండరీ కౌంట్​ రూల్​ ఆధారంగా విజేతగా నిలిచింది. తుది పోరులో ఇంగ్లీష్​ ఆటగాడు బెన్​ స్టోక్స్​ 84 నాటౌట్ ​(98 బంతుల్లో) అద్భుత పోరాటం చేశాడు. అయితే ఈ మ్యాచ్​లోని సూపర్​ ఓవర్​ ముంగిట ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్​ కాల్చాడట.

Ben Stokes smoked a cigarette before playing WC'19 final Super Over
ప్రపంచకప్​ సూపర్ ఓవర్​ ముందు సిగరెట్​ కాల్చిన స్టోక్స్​!

By

Published : Jul 14, 2020, 5:27 PM IST

సాధరణ సిరీస్​లు, టోర్నీల్లోనే ఫైనల్​ అనగానే ఒత్తిడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక ప్రపంచకప్​ అంటే చెప్పక్కర్లేదు. తుది పోరులో ఒక్కసారి టైటిల్​ గెలవని జట్లు పోటీపడితే... కచ్చితంగా కప్పుగెలవాలన్న ఆరాటానికి మైదానంలో ప్రేక్షకులే కాదు ఆటగాళ్లూ నరాలు తెగే ఉత్కంఠలో భాగస్వాములవ్వాల్సిందే. గతేడాది జరిగిన ప్రపంచకప్​లో జరిగింది ఇదే. నాలుగు దశాబ్దాల తర్వాత ఇంగ్లాండ్​ ప్రపంచకప్ గెలవగా.. రన్నరప్​గా నిలిచిన కివీస్​ జట్టు రెండోసారి ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది.

ప్రపంచకప్​తో బెన్​ స్టోక్స్​

మ్యాచ్​లో జట్టు స్కోర్లు సమం కావడం వల్ల సూపర్​ ఓవర్​ ఆడాల్సి వచ్చింది ఆ సమయంలో చిన్న బ్రేక్​ ఇవ్వగా.. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ సిగరెట్​ కాల్చి వచ్చాడట. అంతేకాకుండా చిన్నపాటి తలస్నానం చేసేశాడట. ఈ విషయాన్ని 'మోర్గాన్స్​ మెన్ ద ఇన్​సైడ్​ స్టోరీ ఆఫ్​ ఇంగ్లాండ్స్​ రైజ్​ ఫ్రం క్రికెట్​ వరల్డ్​కప్​ హ్యుమిలియేషన్​ టూ గ్లోరీ' అనే బుక్​లో రాశారు రచయితలు నిక్ హౌల్ట్​, స్టీవ్​ జేమ్స్​. ఇది తాజాగా మార్కెట్లోకి వచ్చింది. ఈ మ్యాచ్​లో చివరి వరకు ఒంటరిపోరాటం చేసి ఇంగ్లీష్​ జట్టుకు చిరకాల స్వప్నం నెరవేర్చాడు స్టోక్స్​. అద్భుత ఇన్నింగ్స్​(98 బంతుల్లో 84*)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్​ విజేత..కివీస్‌కు నిరాశ

ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌-ఇంగ్లీష్‌ జట్లు తలపడ్డాయి నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ సమాన స్కోర్‌ చేయడం వల్ల మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అక్కడా రెండు జట్లు నువ్వా నేనా అనే రీతిలో పోరాడగా.. చివరికి ఇందులో కూడా స్కోర్లు సమమయ్యాయి. చేసేది లేక బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌కు నేటితో ఏడాది పూర్తయింది.

కివీస్‌ స్కోర్‌ తక్కువే.. కానీ

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 241/8 స్వల్ప స్కోర్‌ చేసింది. హెన్రీనికోల్స్‌(55), టామ్‌ లాథమ్‌(47), కేన్‌ విలియ్సన్‌(30) ఓ మోస్తారు స్కోర్లతో జట్టును ఆదుకున్నారు. లేదంటే న్యూజిలాండ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రిస్‌వోక్స్‌(3/37), లియమ్‌ప్లంకెట్‌(3/42) చెలరేగడం వల్ల కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం ఇంగ్లాండ్‌ విజయం నల్లేరుమీద నడకలా అనిపించినా అంత సాఫీగా సాగలేదు. ఆది నుంచీ న్యూజిలాండ్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయగా.. ఆతిథ్య జట్టుకు లక్ష్యం చిన్నదైనా కొండంతలా పెరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌ అనే ఒత్తిడి ఆ జట్టులో స్పష్టంగా కనిపించింది. మధ్యలో బెన్‌స్టోక్స్‌(84), జాస్‌బట్లర్‌(59) ఆదుకోడం వల్ల ఆ జట్టు నిలదొక్కుకుంది.

బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ

45వ ఓవర్‌లో బట్లర్‌ ఔటయ్యాక కివీస్‌ బౌలర్లు పుంజుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంగ్లాండ్‌ టెయిలెండర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్టోక్స్‌ ఒంటరిపోరాటం చేశాడు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన స్థితిలో ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ చేశాడు.

మరోవైపు స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడంతో స్టోక్స్‌ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్లో షాట్‌ ఆడి రెండు పరుగులు తీశాడు. కానీ ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. స్టోక్స్‌ రెండో పరుగుకోసం ప్రయత్నించగా అప్పుడే ఫీల్డర్‌ బంతిని అందుకొని త్రో విసిరాడు. అది నేరుగా వెళ్లి డైవ్‌ చేస్తున్న స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరింది. అలా ఓవర్‌త్రో కారణంగా నాలుగు అదనపు పరుగులు లభించాయి. మొత్తంగా 6 పరుగులు వచ్చాయి. ఇక ఇంగ్లాండ్‌కు కావాలసింది రెండు బంతుల్లో 3 పరుగులే. ఐదో బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా అదిల్‌ రషీద్‌ రనౌటయ్యాడు. చివరి బంతికి మళ్లీ రెండు పరుగులు అవసరం కాగా, ఈసారి మార్క్‌వుడ్‌ రనౌటయ్యాడు. దీంతో స్కోర్లు సమం కాగా, మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

బెన్​ స్టోక్స్ (84 నాటౌట్)

సూపర్‌ ఓవర్‌లోనూ ఉత్కంఠే..

సూపర్‌ ఓవర్‌లో బట్లర్‌, స్టోక్స్‌ మరోసారి బ్యాటింగ్‌కు దిగారు. ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ ధాటిగా ఆడి చివరికి 15 పరుగులు పూర్తిచేశారు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా అన్నే పరుగులు చేసింది. జేమ్స్‌ నీషమ్‌, మార్టిన్‌ గప్తిల్‌ బ్యాటింగ్‌ చేశారు. వీళ్లు కూడా బాగా ఆడగా... మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ మరోసారి టై అయినా బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. అంతకుముందు 2015లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

బెన్​ స్టోక్స్

ABOUT THE AUTHOR

...view details