దీర్ఘ కాలంగా బయో బబుల్లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్. కుటుంబాలు ఉన్న క్రికెటర్లను నిర్భందంలో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని తెలిపాడు.
గత తొమ్మిది నెలల కాలంలో ఎక్కువ క్వారంటైన్, బయో బబుల్, ప్రభుత్వం విధించిన లాక్డౌన్లోనే ఉండాల్సి వచ్చిందని ఫించ్ ఆవేదనగా తెలిపాడు. విభిన్న ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరాడు.
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 20, 21 రోజులు మినహా మొత్తం లాక్డౌన్, బయో బబుల్లో గడిపినట్లు నా భార్య చెప్పింది. ఇలానే దీర్ఘ కాలం కొనసాగితే ఏదైనా జరగొచ్చు. ఇందులో సందేహం లేదు. ఆటగాళ్ల సంక్షేమం కూడా అవసరమే. నెలల తరబడి నిర్భందంలో ఉంచితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్.
ప్రస్తుతం పాకిస్థాన్లో టెస్టు సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:మరోసారి ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన గంగూలీ
"పరిస్థితులు వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా ఉంటాయని ఫించ్ పేర్కొన్నాడు. వివాహమై పిల్లలు ఉన్న వారిని ఇలా నిర్భందంలో ఉంచితే కచ్చితంగా ఇబ్బందే. కుటుంబానికి సంబంధించి ప్రతి విషయం మేము చూసుకోవాల్సి ఉంటుంది. అదే పెళ్లి కాని వారికి ఆ సమస్య ఉండకపోవచ్చు" అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.