వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్ అశ్విన్‌పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్‌లో లేనని అనడం నవ్వు తెప్పించిందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేయాల్సిందని వెల్లడించాడు. శతకం చేసిన తర్వాత అతడు మీడియాతో ఈ విధంగా మాట్లాడాడు.
"మరింత సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బౌలింగ్‌కు రాగానే అశ్విన్ తల మీదుగా షాట్లు ఆడాను. నాకిష్టమైన చోట బంతులు వేయించేలా అతడిపై ఒత్తిడి పెంచాను. వ్యూహం ఫలించినందుకు, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లోనే వేగంగా కదిలాను. పేసర్లను ఎప్పట్లాగే ఎదుర్కొన్నా. ఈ మ్యాచ్‌లో నేను కాస్త దూకుడుగా ఆడాను. ఆరంభంలో బంతికో పరుగు చొప్పున చేయడం వల్ల మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించాను. మూడు వారాల క్రితమే సిడ్నీ మైదానంలో వరుస శతకాలు చేసిన తనను ఫామ్ కోల్పోయానని విమర్శించడం నవ్వు తెప్పించింది. తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోయాను. మూడో టెస్టులో పుంజుకొని శతకం చేయడం వల్ల జట్టు మెరుగైన స్థితిలోనే నిలిచిందని అనుకుంటున్నా. మేం మెరుగైన స్కోరే చేశాం. ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. రెండోరోజు సాయంత్రం బౌలర్లు చక్కగా బంతులు విసిరి రెండు వికెట్లు తీశారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఎంసీజీ నాకెంతో ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను."
- స్టీవ్‌స్మిత్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్