తెలంగాణ

telangana

'ప్రపంచకప్ కష్టమే.. ఐపీఎల్​కే అవకాశం ఎక్కువ'

By

Published : May 23, 2020, 7:13 PM IST

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందన్న నమ్మకం లేదని తెలిపారు ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్. ఆ సమయంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశమే ఎక్కువగా ఉందన్నారు.

ఇయాన్
ఇయాన్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూలు ప్రకారం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్‌ అన్నారు. ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ కోరుకుంటే మాత్రం మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచకప్‌ కష్టమేనని వెల్లడించారు.

షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌, మే నెలల్లో ఐపీఎల్‌ సీజన్‌ జరగాలి. కరోనా వైరస్‌ ముప్పుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. అభిమానులను అనుమతించకుండా క్రీడలు నిర్వహించుకోవచ్చని ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో టోర్నీ నిర్వహణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.

"ముందుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీసీసీఐ గెలుస్తుంది. అక్టోబర్లో ఐపీఎల్‌ నిర్వహించాలనుకుంటే వారికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ జరగకపోవచ్చు" అని ఛాపెల్‌ అన్నారు. ఆసీస్‌ మరో మాజీ సారథి మార్క్‌ టేలర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

"టీ20 ప్రపంచకప్‌ స్థానంలో ఐపీఎల్‌ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అక్టోబర్‌-నవంబర్లో 15 జట్లు ఆస్ట్రేలియాకు వెళ్లి ఏడు వేదికల్లో 45 మ్యాచుల్లో తలపడటం అత్యంత కష్టం. ఒకవేళ ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేస్తే బీసీసీఐకి ఐపీఎల్‌ నిర్వహించేందుకు ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అప్పుడు భారం దేశాలపై కాకుండా వ్యక్తులపై పడుతుంది" అని టేలర్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details