కొత్తగా బాధ్యతలు తీసుకున్న గంగూలీ ఆధ్వర్యంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కార్యవర్గం ఐసీసీ తీరుపై నిప్పులు చెరిగింది. ఐసీసీకి అత్యధిక ఆదాయం బీసీసీఐ నుంచే వస్తున్నా.. భారత బోర్డుకు సరైన గౌరవం దక్కట్లేదని తెలిపింది.
ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవిలో చేరినప్పటి నుంచి బిగ్ త్రీ మోడల్(ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్) రద్దు చేశారు. అప్పట్నుంచి భారత్ ఆధిపత్యం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఐసీసీ నిబంధనల వల్ల భారత్ 570 మిలియన్ డాలర్ల ఆదాయం నష్టపోతుంది. దీనిపై తాజాగా మాట్లాడిన కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్.. తమకు రావాల్సిన వాటాపై గట్టిగా పోరాడతామని తేల్చిచెప్పాడు.
" ఐసీసీకి మార్గనిర్దేశం చేయడంలో బీసీసీఐ పాత్ర లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు బీసీసీఐ లేకుండా ఐసీసీ ఉందా?. భారత బోర్డు సహకారం లేకుండా ఐసీసీ ఏమి చేస్తుంది. ఎఫ్‌టీపీ(ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్)ను డిజైన్ చేసుకునే క్రమంలో ఐసీసీతో బీసీసీఐ కలవదు. ప్రస్తుతం మా లక్ష్యం బీసీసీఐ ఆదాయాన్ని పెంచడమే".
- అరుణ్‌సింగ్, బీసీసీఐ కోశాధికారి
ఐసీసీ నుంచి తమ వాటా పూర్తిస్థాయిలో రావడం లేదంటూ గంగూలీ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత్‌కు అన్యాయం...
ఐసీసీకి అత్యధిక ఆదాయం భారత్ నుంచే వస్తుంది. ఆదాయంలో మాత్రమే కాదు క్రికెట్ ఆదరణ విషయంలోనూ భారత్‌దే కీలకపాత్ర. కానీ కొంతకాలంగా బీసీసీఐని ఐసీసీ గౌరవించట్లేదు. తాజాగా వర్కింగ్ గ్రూప్‌లోనూ బీసీసీఐ ప్రతినిధులకు చోటు దక్కలేదు. బిగ్ త్రీ మోడల్ (ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్)ను ఐసీసీ రద్దు చేసి.. కొత్త రెవెన్యూ పద్ధతి అవలంభిస్తోంది. దీని వల్ల భారీగా ఆదాయం కోల్పోతుంది బీసీసీఐ.
2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2016-2023 మధ్యలో భారత్‌కు ఐసీసీ నుంచి 372 మిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే రానుంది. తమ వాటా ప్రకారం రెట్టింపు రావాల్సి ఉందని గంగూలీ ఇప్పటికే ఐసీసీని ప్రశ్నించాడు.
పన్ను రాబడతాం..
ఐసీసీ నిర్వహించే కార్యక్రమాలకు బ్రాడ్‌కాస్టర్లు దిగుమతి చేసుకునే అన్ని రకాల పరికరాలకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని ఐసీసీ కోరుతోంది. కానీ పన్ను మినహాయింపు అనేది కేంద్రం పరిధిలోని అంశం. ఒకవేళ పన్నులు కట్టాల్సి వస్తే ఆ మొత్తాన్ని బీసీసీఐ ఆదాయం నుంచి కోత వేస్తామని ఐసీసీ ఛైర్మన్ మనోహర్ ఇప్పటికే హెచ్చరించాడు. ఈ విషయంపై న్యాయ, ఆర్థిక పరమైన సలహాలు కోరతామని దాదా చెప్పాడు. అంతేకాకుండా ఐసీసీ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్‌నే ఆ పన్ను భారం భరించేలా బీసీసీఐ ఒప్పించేందుకు త్వరలోనే ముందడుగు వేయనుందని పరోక్షంగా చెప్పాడు అరుణ్‌సింగ్.