టీమ్ఇండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడటానికి అనుమతించాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఎవరైతే భారత జట్టు కాంట్రాక్టులు లేకుండా ఉన్నారో వారికి విదేశీ టోర్నీల్లో ఆడే అవకాశం ఇవ్వాలని బోర్డును కోరాడు. ఇదే విషయాన్ని ఆల్‌రౌండర్ సురేశ్ రైనా, మాజీ పేసర్ ఇర్ఫాన్ ఖాన్ వేర్వేరు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
"నాకు తెలిసి విదేశీ లీగులు ఆడటానికి క్రికెటర్లను బీసీసీఐ అనుమతించాలి. ముఖ్యంగా బోర్డు తరపున ఎలాంటి కాంట్రాక్టులు పొందని వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటగాళ్లు ఎవరైతే 50 టెస్టులు లేదా 35 ఏళ్లు పైబడిన వారు ఉంటారో వారిని అనుమతించేలా వ్యవస్థను తయారు చేయండి".
- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా స్పిన్నర్
హర్భజన్ సింగ్.. తన కెరీర్లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్లలో 294 వికెట్లను పడగొట్టాడు. 2015లో శ్రీలంకపై టెస్టు, అదే ఏడాది దక్షిణాఫ్రికాపై వన్డే, 2016లో ఆసియాకప్‌లో యూఏఈపై టీ20 సిరీస్‌లలో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడాడు.
హర్భజన్..తాను క్రికెట్ నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను మాట్లాడుతూ.."నేను ఒకవైపు చింతిస్తున్నా.. కొన్నింటిని బాగా నిర్వహించగలిగానని సంతృప్తిగా ఉంది. ఆటగాడిగా 100 టెస్టులు ఆడటమనేది చాలా పెద్ద విషయం, వారిలో ఒకరిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఆటతీరు కొంచెం తగ్గిందని అంగీకరిస్తున్నా లేదా వారు ఊహించిన విధంగా నేను ఆడకపోవచ్చు. ఆ సమయంలో నాతో మాట్లాడటానికి ఎవరూ రాలేదు. వెస్టిండీస్‌పై 400వ వికెట్ సాధించిన తర్వాత జట్టులోకి ఒక్కసారీ తిరిగి ఎంపిక చేయలేదు" అని అన్నాడు హర్భజన్.
ఇదీ చూడండి... రెండు టోర్నీలపై రోహిత్ ఆసక్తి.. అవేంటంటే?