సచిన్ తెందుల్కర్.. క్రికెట్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో పరుగుల ప్రవాహాన్ని పారించి అభిమానులకు దేవుడిగా కనిపించాడు. అయితే ఏ క్రికెటర్‌కైనా ఏదో ఒక దశలో ఓ అదృష్టం తలుపుతడుతుంది. అలాగే సచిన్‌ను కూడా తట్టింది. అదే ఓపెనర్ అవకాశం. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన మాస్టర్ న్యూజిలాండ్‌పై ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. అది సరిగ్గా ఈరోజే. ఈ సందర్భంగా బీసీసీఐ ట్వీట్‌తో ఆ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంది.
ఆ ఒక్క ఇన్నింగ్స్ సచిన్ కెరీర్‌ను మార్చింది - Sachin Tendulkar Debut As OPener
తన క్రికెట్ కెరీర్లో సచిన్ తెందుల్కర్ ఓపెనర్‌గా అరంగేట్రం చేసింది సరిగ్గా ఈరోజే. 1994లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మాస్టర్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు.
1994.. మార్చి 27. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డే. ఈ మ్యాచ్‌లో మొదటిసారి సచిన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్‌ను మలుపుతిప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మాస్టర్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్‌గా ఈ ప్రదర్శనతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సచిన్. అదే పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ దూసుకెళ్లాడు. ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు.
మొత్తంగా కెరీర్లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. అలాగే ప్రపంచకప్‌లో మొత్తం 2,278 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.