ఈడెన్ వేదికగా భారత్-బంగ్లా మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త బంతి దర్శనమిచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను డే అండ్ నైట్‌గా నిర్వహించి, గులాబి బంతిని వాడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)తో చర్చలు జరుపుతోంది బీసీసీఐ. ఇందులో బంగ్లా బోర్డు నిర్ణయం కీలకం కానుంది.
"రెండో టెస్టును డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహిద్దామని బీసీసీఐ కోరింది. మేము కొంత సమయం కావాలని అడిగాం. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి లేదా రెండు రోజుల్లో మా అభిప్రాయం తెలియజేస్తాం".
--అక్రమ్ ఖాన్, బీసీబీ బోర్డు అధికారి
యాజమాన్యం, ఆటగాళ్లతో ఓసారి చర్చించాక కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని అక్రమ్ తెలిపాడు.
గంగూలీ ఆసక్తిగా...
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరభ్ గంగూలీ... గులాబీ బంతిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కోహ్లీ కూడా ఈ నిర్ణయానికి మద్దతిచ్చాడు. పింక్ బాల్‌తో టెస్టు నిర్వహణకు మంచిదని అభిప్రాయపడిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే... ఈ విషయంలో వాతావరణం, వేదిక, మ్యాచ్ జరిగే రోజులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నాడు. మంచు కారణంగా రాత్రి పూట బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోతే కాస్త సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పాడు.
గతంలో భారత్ నో...
మూడేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటించే ప్రతి జట్టు.. గులాబి బంతితోనే డే/నైట్ టెస్టు ఆడుతున్నాయి. 2018 డిసెంబరులో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ ఆడాల్సింది. కానీ పింక్‌బాల్‌తో ఆట ఆడాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించింది.
అడిలైడ్‌లో డే/నైట్ టెస్టు
- గులాబి బంతి దెబ్బతినకుండా ఎక్కువ మన్నిక వచ్చేందుకు వికెట్‌పై అదనపు పచ్చిక ఉంచుతారు. ఇలా పిచ్‌పై పచ్చిక అదనంగా ఉంటే సీమర్లకు అనుకూలిస్తుంది. ఆసీస్‌లో పొడగరి, బలమైన పేసర్లు ఉన్నారు. దీని వల్ల మ్యాచ్ ఆసీస్‌కు అనుకూలంగా మారుతుందని భారత బోర్డు భావించింది.
- ఎక్కువ సేపు ఈ బంతిని ఉపయోగించడం వల్ల రంగు మారి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కనిపించదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తోనూ బంగ్లాదేశ్ ఇలానే గులాబి బంతిపై నిరాశక్తి వ్యక్తం చేసింది.
2016 సీజన్ దులీప్ ట్రోఫీలో భారత్ మొదటిసారి గులాబి బంతిని వాడింది. అయితే టీమిండియా మాత్రం వీటిని ఉపయోగించలేదు. ఈ ఏడాది జరిగిన దేశవాళీ ట్రోఫీలోనూ ఫైనల్లో గులాబీ వాడాల్సి ఉన్నా... దాన్ని కాదని సంప్రదాయ పద్దతిలోనే ఎర్ర బంతితోనే మ్యాచ్ జరిగింది.
ఇప్పుడెందుకు..?
ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అభిమానులు పెద్దగా స్టేడియానికి రాలేదు. విద్యార్థులకు ఉచిత పాస్‌లు ఇచ్చినా మూడు వేదికల్లోనూ ఆదరణ దక్కలేదు. రోజంతా ఎండ తీవ్రతకు బయపడి తక్కువ మందే వచ్చారు. అయితే ప్రేక్షకులను రప్పిచాలంటే సాయంత్రం వేళ జరిగే డే/నైట్ టెస్టులు మంచిదని భావిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ తరహాలో సరదాగా సాయంత్రం ఆట చూసేందుకు జనాలు వస్తారని భారత బోర్డు అనుకుంటోంది.
ఫలితాలివే...
ఇప్పటి వరకు పురుషుల క్రికెట్‌లో 11 డే/నైట్ టెస్టులు జరిగాయి. భారత్, బంగ్లాదేశ్ మినహా అన్ని టాప్-10 జట్లు గులాబీ బంతితో ఆడాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింటిలోనూ విజయం సాధించింది. శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి.
బంగ్లాదేశ్, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి ఇండోర్ వేదికగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది బంగ్లా. రెండో మ్యాచ్ నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. రెండు బోర్డులు ఒప్పుకుంటే ఈ మ్యాచ్ డే/నైట్‌లో ఆడనున్నాయి ఇరుజట్లు.