తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ... నువ్వు మళ్లీ ఆడితే చూడాలనుంది' - ధోనీ... నువ్వు మళ్లీ ఆడితే చూడాలనుంది

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు టీమిండియా మాజీ సారథి గంగూలీ. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన దాదా... భారత సీనియర్​ క్రికెటర్ ధోనీ రిటైర్మెంట్ విషయంపై మాట్లాడాడు.

'ధోనీ... నువ్వు మళ్లీ ఆడితే చూడాలనుంది'

By

Published : Oct 23, 2019, 5:22 PM IST

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బుధవారం.. బాధ్యతలు చేపట్టాడు సౌరభ్​ గంగూలీ. అనంతరం టీమిండియా సీనియర్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. మహీని దేశానికి గర్వకారణంగా అభివర్ణించాడు. క్రికెట్​లో అతడొక తురుపుముక్కని, తన పదవీ కాలంలో ధోనీ మళ్లీ క్రికెట్​ ఆడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

" క్రికెట్​ కొనసాగించాలా, వద్దా అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం. నేనూ ఒకానొక సమయంలో క్రికెట్​ను వదిలేద్దామనుకున్నా, కాని ప్రపంచం ఒప్పుకోలేదు. అందుకే మరో నాలుగేళ్లు ఆటలో కొనసాగాను. ఛాంపియన్లు త్వరగా క్రీడను వదిలిపెట్టకూడదు. కెరీర్​ కోసం మహీ మనసులో ఏముందో నాకైతే తెలియదు. కచ్చితంగా ఈ విషయం గురించి అతడితో చర్చిస్తా. అతడొక అద్భుతమైన ఆటగాడు"
--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

దేశానికి ఎనలేని విజయాలు అందించిన అధ్బుతమైన సారథిగా ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు గంగూలీ.

గంగూలీ, ధోనీ

"ధోనీని చూసి యావత్​ దేశం గర్విస్తోంది. క్రీడల్లో దేశానికి తెచ్చిన పేరు, విజయాలు అతడ్ని అత్యుత్తమంగా తయారుచేశాయి. మహీ సాధించిన ఘనతలు కూర్చొని రాస్తే, ఎవరైనా వావ్​ అనకుండా ఉండలేరు. నేను ఈ పదవిలో ఉన్నంతవరకు అందరికీ తగిన గౌరవం దక్కేలా చూస్తాను."
--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

టీమిండియా ప్రస్తుత సారథి విరాట్​ కోహ్లీతో గంగూలీ... రేపు (గురువారం) భేటీ కానున్నాడు. ఇందులో ధోనీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించనున్నాడు.

గంగూలీ, కోహ్లీ

9 నెలలు మాత్రమే...

బీసీసీఐ అధ్యక్ష పదవిలో 9 నెలలు మాత్రమే కొనసాగనున్నాడు గంగూలీ. అయిదేళ్లకు పైగా కోల్‌కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా పని చేసిన దాదా.. లోథా కమిటీ 'తప్పనిసరి విరామం' నిబంధన కారణంగా తర్వాత మూడేళ్లు విరామం తీసుకోవాలి. దాదా పగ్గాలు చేపట్టండం వల్ల 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకుంది.

ధోనీ మళ్లీ వస్తున్నాడా..!

ఈ ఏడాది ప్రపంచకప్​లో భారత్​ సెమీఫైనల్లో నిష్క్రమించిన తర్వాత ధోనీ మళ్లీ బ్యాట్​ పట్టలేదు. 38 ఏళ్ల ఈ స్టార్​ క్రికెటర్..​ ఆ తర్వాత ఆర్మీలో పనిచేశాడు.

అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్​ సిరీస్​కు ధోనీ ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.

ABOUT THE AUTHOR

...view details