బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. ప్రతిష్ఠాత్మక డే/నైట్ టెస్ట్ సిరీస్ కోసం బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించిన దాదా... అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. దీనిలో భాగంగానే చిన్నస్వామి స్టేడియంలో ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌తో బుధవారం భేటీ అయ్యాడు గంగూలీ.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 23 ఏళ్ల తర్వాత...
ద్రవిడ్, గంగూలీ ఒకేసారి టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ, ఎన్‌సీఏ డైరెక్టర్ పదవిలో ద్రవిడ్ భేటీ అయ్యారు. బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), దాని అభివృద్ధి ప్రణాళిక గురించిఈ భేటీలో చర్చించారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ద్రవిడ్‌తో మాట్లాడాడు దాదా.
ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌తో, టీమిండియా కోచ్ రవిశాస్త్రి 40 ఎకరాల్లో అధునాతన భవనం..
జాతీయ క్రికెట్ అకాడమీని మరింత అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. సమావేశం తర్వాత వీరంతా కలిసి నగరంలో కొత్తగా ఎన్‌సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు.
దేవనహల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన అకాడమీ నిర్మాణం కోసం... కర్ణాటక ప్రభుత్వం 15 ఎకరాల భూమిని బీసీసీఐకి ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో మరో 26 ఎకరాలు కేటాయించడం వల్ల ప్రస్తుతం 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)ను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతమున్న ప్రణాళిక ప్రకారం మూడు మైదానాలు, ఇండోర్ నెట్స్, పరిపాలనా భవనాలు, హాస్టళ్లు కట్టనున్నారు.