ఐపీఎల్ ఖర్చు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ ప్రైజ్‌మనీని భారీగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అన్ని ఫ్రాంఛైజీలకు తెలియజేసింది. ఫలితంగా విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు మాత్రమే అందనుంది.
"ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిలో మార్పులు చేశాం. విజేతగా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు లభిస్తాయి. రన్నరప్‌కు రూ.12.5 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్లు దక్కుతాయి. ప్రస్తుతం అన్ని ఫ్రాంఛైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్‌షిప్స్ వంటి మార్గాలు వారికి ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రైజ్‌మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం"
-- బీసీసీఐ ప్రతినిధి