ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్టు నిర్వహణపై గంగూలీకి ప్రముఖుల నుంచి ప్రశంసలు వెళ్లువెత్తాయి. ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను.. గులాబి బంతితో నిర్వహించడంలో దాదా కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ నిర్ణయంపై అభినందనలు తెలుపుతూనే కొందరు క్రికెట్ దిగ్గజాలు.. టీిమిండియాను కవ్విస్తున్నారు. వీలైతే అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో వచ్చే ఏడాది డేనైట్ టెస్టు ఆడాలని కోరాడు ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్. దీనిపై తాజాగా గంగూలీ స్పందించాడు.
" ఈడెన్‌లో మ్యాచ్‌ను అతడు(వార్న్) చూసే ఉంటాడు. కచ్చితంగా కోల్‌కతాలో వచ్చిన ఫలితాన్ని గుర్తిస్తాడు. అయితే అడిలైడ్‌లో మ్యాచ్ అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు అందరిదీ కాబట్టి.. వేచి చూద్దాం ఏం జరుగుతుందో".
- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
వాన్, పైన్ మాటలు...
ప్రస్తుతం టెస్టుల్లో టాప్ జట్టుగా రాణిస్తోన్న భారత్.. వచ్చే ఏడాది ఆసీస్‌తో తలపడాలని ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్, ప్రస్తుత ఆసీస్ సారథి టిమ్ పైన్ అభిప్రాయపడ్డారు.
" వెల్‌డన్ గంగూలీ.. ఆసీస్‌లో తర్వాతి మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటా..." అని ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
భారత్‌తో పింక్ బాల్ టెస్టు గురించి టిమ్‌ను ప్రశ్నించగా... ఆస్ట్రేలియా సిద్ధంగానే ఉందని, భారత్ ఒప్పుకుంటే చాలని అభిప్రాయపడ్డాడు.
" మేము సిద్ధమే.. మరి అక్కడ కోహ్లీ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ అతడు(విరాట్) మంచి మూడ్‌లో ఉంటే అంగీకరిస్తాడు. అప్పుడు మా మధ్య పింక్ బాల్ టెస్టు జరుగుతుంది. మేమూ గులాబి బంతితో భారత్‌తో ఆడటానికి ప్రయత్నించాం... మళ్లీ ప్రయత్నిస్తాం. అవసరమైతే కోహ్లీ నిర్ణయం కోసం పరుగెడతాం. ఏదో ఒకరోజు గులాబి టెస్టుపై మేము ఊహించిన సమాధానాన్ని పొందుతాం. ఇప్పటివరకు కోహ్లీ డేనైట్ టెస్టుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు భారత్ ఇదే తరహా మ్యాచ్ ఆడింది కాబట్టి వచ్చే వేసవిలో.. ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు ఉంటుందనే అనుకుంటున్నా."
- టిమ్ పైన్, ఆసీస్ సారథి
గతేడాది అడిలైడ్‌లో పింక్ టెస్టు ఆడాలన్న ఆసీస్ ప్రతిపాదనను... బీసీసీఐ, కోహ్లీ తిరస్కరించారు. ఐసీసీ 2015లో డే/నైట్ టెస్టులను ఆమోదించగా... టాప్ టెస్టు దేశాల్లో 8 వీటిని ఆడేశాయి. తాజాగా ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, బంగ్లా తొలిసారి గులాబి టెస్టులో తలపడ్డాయి.