భారత్‌లో నిర్వహించే 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ), ఐసీసీని కోరింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "ఇకపై ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడరని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హామీ ఇవ్వగలదా" అంటూ కౌంటర్ ఇచ్చారు.
పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై బీసీసీఐ కౌంటర్!
భారత్‌లో నిర్వహించబోయే టీ20, వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రతకై బీసీసీఐ నుంచి హామీ కావాలంటూ ఐసీసీని కోరింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దానికి ముందు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన సహా ఇతర ఉగ్రవాద కార్యకలాపాలు ఇకపై జరగవని హామీ ఇవ్వగలరా అంటూ ఓ బీసీసీఐ అధికారి కౌంటర్ ఇచ్చారు.
"టోర్నీలు నిర్వహించే విషయంలో ఏ ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఐసీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతి క్రికెట్ బోర్డుకు ఇదే వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వాల కార్యకలాపాల్లో క్రికెట్ బోర్డులూ కలగజేసుకోరాదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి వీసా సంబంధిత హామీ అడిగే ముందు సరిహద్దుల్లో ఇకపై ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండదని, ఎలాంటి ఉగ్రవాద చర్యలను ఆ దేశం పాల్పడబోదని పాక్ బోర్డు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి." -బీసీసీఐ అధికారి
భారత్‌లో నిర్వహించే 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రత.. ఆటగాళ్లకు వీసాల మంజూరుపై స్పష్టతనివ్వాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, 2021లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఎక్కడ జరుపుతారనే విషయంపై త్వరలోనే ఐసీసీ ఓ సమావేశం ఏర్పాటుచేయనుందని చెప్పారు. ఇంతకుముందు భారత్‌లో జరిగిన క్రీడా ఈవెంట్లలో పాక్ అథ్లెట్లకు అనుమతులు ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి తాము ముందుగానే హామీ కోరుతున్నట్లు తెలిపారు వసీమ్ ఖాన్.