బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్) నేడు ప్రారంభం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. భారత క్రికెట్ బోర్డు నూతన రాజ్యాంగంలో ఆచరణయోగ్యంగా లేని నిబంధనలను మార్చే సాధ్యాసాధ్యాలపై ఇక్కడ చర్చించనున్నారు.
విరామంపై దృష్టి..?
ఈ సమావేశంలో పదవుల మధ్య విరామంపై కీలక నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ బృందం. కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనపై చర్చిస్తామని బోర్డు కోశాధికారి అరుణ్ ధూమల్ ఇప్పటికే స్పష్టం చేశారు.
" వయో పరిమితిని అలాగే ఉంచుతున్నాం. పదవుల మధ్య విరామాన్ని సవరించే అంశంపై దృష్టిపెట్టాం. రాష్ట్ర సంఘంలో ఆరేళ్లు అనుభవం సంపాదించిన వ్యక్తికి విరామం ఎందుకివ్వాలి? క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా ఆ అనుభవాన్ని బీసీసీఐలో ఎందుకు ఉపయోగించుకోవద్దు? విరామం ముందు అధ్యక్షుడు, కార్యదర్శిని వరుసగా రెండు దఫాలు, కోశాధికారి, ఇతర పాలకులకులను ఒకేసారి మూడు దఫాలు (9 ఏళ్లు) కొనసాగించాలి. గత నెలలో బోర్డు ఎన్నికలు జరిగితే 38 మందిలో కేవలం నలుగురైదుగురికే సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర సంఘాల్లో అనుభవం ఉన్నవారిని బీసీసీఐలో ఉపయోగించుకుంటే మంచిది. లోధా సిఫార్సుల ప్రకారమైతే ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలి"
-- అరుణ్ ధూమల్, బీసీసీఐ కోశాధికారి
బీసీసీఐ ఏజీఎమ్: లోధా కమిటీ సంస్కరణలకు చరమగీతం..! ఇదీ నిబంధన....
జస్టిస్ ఆర్‌ఎం లోధా సిఫార్సుల ప్రకారం ఏ పాలకుడైనా రాష్ట్రంలో లేదా బీసీసీఐలో రెండు దఫాలు పనిచేసిన తర్వాత మూడేళ్లు కచ్చితంగా విరామం తీసుకోవాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కేవలం 10 నెలలు మాత్రమే పదవిలో ఉండాలి. ఎందుకంటే ఆయన బంగాల్ అధ్యక్షుడుగా నాలుగున్నరేళ్లకు పైగా పనిచేశారు. ఇప్పుడు నిబంధన సవరిస్తే తొలి ప్రయోజనం ఆయనకే చేకూరుతుంది.
అయితే గతంలో సుప్రీం కోర్టే ఒక రాష్ట్రం ఒక ఓటు’ వంటి నిబంధనలను సవరించిందని గుర్తుచేశాడు అరుణ్. సీఓఏ సైతం పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఇలాగే వ్యవహరించిందని తెలిపాడు. మూకుమ్మడిగా తామే అన్ని నిర్ణయాలు అమలు చేయబోమని స్పష్టం చేసిన అరుణ్... సవరించిన నిబంధనలు సుప్రీం కోర్టుకు సమర్పిస్తామని తెలిపాడు.
రాష్ట్ర సంఘాలతో...
ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో... పలు అంశాలపైరాష్ట్ర క్రికెట్ సంఘాలతోనూ చర్చించనుంది బీసీసీఐ. ప్రయోగాత్మకంగా నిర్వహించిన డే/నైట్ టెస్టు విజయవంతం కావడం వల్ల టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు దీనిని ఇంకా ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని సంఘాలను అడిగి ఒక విధాన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచు ప్రభావం, మైదానం, ఆడే కాలాన్ని బట్టి మున్ముందు గులాబీ బంతి మ్యాచుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ధూమల్ వెల్లడించాడు.
ఇదీ చదవండి: శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్