బంగ్లాదేశ్ వేదికగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య వచ్చే నెలల్లో రెండు టీ20లు జరగనున్నాయి. వచ్చే నెల 18 నుంచి 21 తేదీల మధ్య ఈ సిరీస్ నిర్వహించనుంది బంగ్లా క్రికెట్ బోర్డు. ఇందులో ఆసియా ఎలెవర్ తరఫున ఆడబోయే నలుగురు టీమిండియా క్రికెటర్ల పేర్లను తాజాగా వెల్లడించింది బీసీసీఐ. భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ సహా షమి, ధావన్, కుల్దీప్ ఈ జాబితాలో ఉన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు.
పింక్ టెస్టుకు మద్దతిచ్చినందుకే
గతేడాది నవంబర్లో భారత్-బంగ్లా మధ్య చారిత్రక గులాబి టెస్టు జరిగింది. గులాబి బంతితో ఇరుజట్లు తొలిసారి ఆడాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చారు. ఇందుకు కృతజ్ఞతగా బీసీబీ నిర్వహిస్తున్న ఆసియా ఆల్‌స్టార్ ఎలెవన్, ప్రపంచ ఆల్‌స్టార్ ఎలెవన్.. రెండు టీ20ల సిరీస్‌కు హాజరవుతానని దాదా హామీ ఇచ్చాడు. భారత ఆటగాళ్లను పంపుతానని చెప్పాడు. బంగ్లాదేశ్ పితామహుడు, బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తోంది బంగ్లా బోర్డు.